Let's talk: editor@tmv.in
రైల్వే కౌంటర్లలో తత్కాల్ టికెట్లకు ఓటీపీ తప్పనిసరి

రైల్వే కౌంటర్లలో తత్కాల్ టికెట్లకు ఓటీపీ తప్పనిసరి

Pinjari Chand
4 డిసెంబర్, 2025

రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తత్కాల్ రైలు టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఇకపై ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్‌కు వచ్చే ఒన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది. ఈ నియమాన్ని త్వరలోనే అన్ని రైళ్లకు వర్తింపజేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. నవంబర్ 17 నుంచి కొన్ని రైళ్లలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ ఓటీపీ విధానాన్ని మొదట 52 రైళ్లకు విస్తరించారు. ఇప్పుడు మిగతా అన్ని రైళ్లకూ రానున్న కొద్ది రోజుల్లోనే ఈ నియమం అమలులోకి రానుంది.

కొత్త విధానం ఎలా పనిచేస్తుంది?

కౌంటర్ వద్ద తత్కాల్ టికెట్ కోసం దరఖాస్తు ఫారం నింపినప్పుడు ప్రయాణికుడు తన మొబైల్ నంబరు ఇవ్వాలి. ఆ నంబరుకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని క్లర్క్‌కు చూపించి వెరిఫై చేయించుకున్న తర్వాతే టికెట్ జారీ అవుతుంది. ఓటీపీ లేకుండా లేదా తప్పుగా ఉంటే తత్కాల్ టికెట్ బుక్ కాదు.

అమలు వెనుక ఉద్దేశం

ఈ చర్యతో బ్రోకర్లద్వారా జరుగుతున్న అవినీతి, దుర్వినియోగం తగ్గి, నిజమైన ప్రయాణికులకు చివరి నిమిషం టికెట్లపై మెరుగైన అవకాశాలు లభిస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇది టికెటింగ్ వ్యవస్థలో పారదర్శకత, భద్రత పెంపును లక్ష్యంగా చేసుకున్నదని వారు అన్నారు. గతంలో ఏజెంట్లు గంటల కొద్దీ క్యూలో నిలబడి ఫేక్ పేర్లతో బల్క్ బుకింగ్‌లు చేసి, టికెట్లను అమాంతం ఎక్కువ ధరకు అమ్మేవారు. ఇప్పుడు నిజమైన ప్రయాణికుడి మొబైల్‌కే ఓటీపీ వచ్చేలా చేయడంతో ఏజెంట్లు ఇతరుల పేరుతో టికెట్లు బుక్ చేయడం దాదాపు అసాధ్యమైంది. ఇది ఇప్పటికే ఆన్‌లైన్‌లో అమలవుతోంది జులై 2025 నుంచి ఆన్‌లైన్ తత్కాల్ బుకింగ్‌కు ఆధార్ ఆధారిత ఓటీపీ తప్పనిసరి. అక్టోబర్ 1, 2025 నుంచి జనరల్ కోటా బుకింగ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో కేవలం ఆధార్ వెరిఫైడ్ వాళ్లకు మాత్రమే అనుమతి ఉంది. ఇప్పుడు కౌంటర్ బుకింగ్‌కూ ఓటీపీ తప్పనిసరి కావడంతో తత్కాల్ వ్యవస్థ మొత్తం మరింత పారదర్శకంగా, నిజమైన ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.