Let's talk: editor@tmv.in
రైల్వేలో 2,569 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రైల్వేలో 2,569 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Panthagani Anusha
7 నవంబర్, 2025

భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బి) దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త అందించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బి) తన సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ (సిఇఎన్‌నెం. 05/2025) ద్వారా మొత్తం 2,569 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల్లో జూనియర్ ఇంజినీర్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ వంటి కీలక పోస్టులు ఉన్నాయి.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకు డిసెంబర్ 2, 2025 తుది గడువుగా నిర్ణయించారు. ఒకవేళ దరఖాస్తు ఫారంలో ఏవైనా తప్పులుంటే, వాటిని సవరించుకోవడానికి డిసెంబర్ 3 నుంచి 12 వరకు అవకాశం కల్పించారు.

విద్యార్హతలు, వయోపరిమితి

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్న మొత్తం 2,569 ఖాళీలలో ప్రధానంగా ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఇంజినీర్ (జేఈ), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ వంటి పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా లేదా బీఈ/బీటెక్ డిగ్రీ తప్పనిసరి. ఇక కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో కనీసం 55 శాతం మార్కులతో సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి విషయానికొస్తే, జనవరి 1, 2026 నాటికి అభ్యర్థి వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వ్డ్ కేటగిరీల (ఎస్సీ /ఎస్టీ,ఓబీసీ, మాజీ సైనికులు) వారికి గరిష్ట వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక, పరీక్ష విధానం

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొత్తం నాలుగు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష-1 , రెండో దశలో 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష-2 నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షల్లోనూ అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏమిటంటే, సీబీటీ-1, సీబీటీ-2 పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధించబడుతుంది.

దరఖాస్తు రుసుము

దరఖాస్తు రుసుము కేటగిరీలను బట్టి మారుతూ ఉంటుంది. జనరల్,ఓబిసి అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 500గా నిర్ణయించారు. అయితే సీబీటీ -1కు హాజరైతే, అందులో నుంచి రూ. 400 తిరిగి చెల్లించడం జరుగుతుంది. మరోవైపు ఎస్సీ/ఎస్టీ మహిళలు, ఈబీసీ, పీడబ్ల్యూబీడీ వంటి రిజర్వ్డ్ కేటగిరీల వారికి కేవలం రూ. 250 రుసుము ఉంటుంది. వీరు సీబీటీ -1కు హాజరైతే వారు చెల్లించిన మొత్తం రూ.250 తిరిగి చెల్లిస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 జీతంగా చెల్లిస్తారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఆర్ఆర్‌బి అధికారిక వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in/ లో ఉన్న నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.