
రైల్వేలో లోకో పైలట్లపై అధిక పని భారం: యూనియన్ ఆరోపణ
భారతీయ రైల్వేలో లోకో పైలట్లపై అధిక పని భారం పడుతోందని ఆల్‌ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ) ఆరోపించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో లోకో పైలట్లలో 55 శాతం కంటే ఎక్కువ మంది అధికంగా పనిచేయాల్సి వచ్చిందని యూనియన్ తెలిపింది. సుమారు 8.85 శాతం లోకో పైలట్లు ఒకే రోజు 12 గంటలకు పైగా నిరంతరం విధులు నిర్వహించగా, మరో 46.96 శాతం మంది తొమ్మిది గంటలకు పైగా పనిచేశారని వెల్లడించింది. నిబంధనల ప్రకారం ఇండియన్ రైల్వేస్‌లో ఒక లోకో పైలట్ ఒకేసారి తొమ్మిది గంటలకు మించిన షిఫ్ట్ చేయకూడదు. సైన్-ఇన్ నుంచి సైన్-అవుట్ వరకు మొత్తం పని సమయం 11 గంటలకు మించకూడదని నిబంధనలు పేర్కొంటున్నాయి. 2021 నుంచి రైల్వే బోర్డు అన్ని జోన్లకు కనీసం 80 శాతం ప్రయాణాలు తొమ్మిది గంటల లోపే పూర్తి చేయాలని సూచించినట్లు యూనియన్ తెలిపింది.
పని గంటలను తగ్గించండి
యూనియన్ ప్రధాన కార్యదర్శి కేసీ జేమ్స్ మాట్లాడుతూ, రైల్వే బోర్డు ఖాళీలను తగ్గించామని చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. లోకో పైలట్ల అధిక పని గంటలు భద్రతపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. 2026–27లో 12 గంటలకు మించిన విధులను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డును కోరారు. జోన్‌ల వారీగా చూస్తే ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో 23.80 శాతం లోకో పైలట్లు 12 గంటలకు పైగా పనిచేసినట్లు యూనియన్ తెలిపింది. అదే జోన్‌లో 60.05 శాతం మంది తొమ్మిది గంటలకు మించిన షిఫ్ట్‌లలో పనిచేశారు. సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 19.92 శాతం లోకో పైలట్లు 12 గంటలకు పైగా, 55.53 శాతం మంది తొమ్మిది గంటలకు మించి విధులు నిర్వహించారు.
లోకో పైలట్లను నియమించాం
అదే సమయంలో నార్తరన్ రైల్వే, నార్త్ ఈస్ట్రన్ రైల్వే జోన్లలో మాత్రం పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని యూనియన్ తెలిపింది. నార్తర్న్ రైల్వేలో 0.82 శాతం, నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 0.96 శాతం లోకో పైలట్లు మాత్రమే 12 గంటలకు పైగా పనిచేసినట్లు పేర్కొంది. ఇక లోకో పైలట్ల పని పరిస్థితులు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల పార్లమెంటులో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇస్తూ గత రెండేళ్లలో 15,873 అసిస్టెంట్ లోకో పైలట్లను నియమించామని, మరో 20 వేల మందికి పైగా నియామక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. లోకో పైలట్ల పని గంటలు అవర్స్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ రూల్స్ (హెచ్‌వోఈఆర్) ప్రకారం పర్యవేక్షించబడుతున్నాయని ఆయన వివరించారు.
