
రైలు కింద పడి మాజీ సైనికుడు ఆత్మహత్య
దువ్వాడ రైల్వే స్టేషన్‌లో శనివారం మధ్యాహ్నం ఘోర విషాదం చోటుచేసుకుంది. దేశ రక్షణలో సేవలందించి, విశ్రాంత జీవితం గడుపుతున్న ఒక మాజీ సైనికుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పెదగంట్యాడ మండలం నెల్లిముక్కుకు చెందిన నీలాపు వెంకటరమణ (64) అనే వ్యక్తి, ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమికంగా వెల్లడైంది.
పోలీసులు, ప్రత్యేక్ష సాక్షుల తెలిపిన వివరాల ప్రకారం వెంకటరమణ శనివారం మధ్యాహ్నం 1:07 గంటల సమయంలో దువ్వాడ స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్నారు. బెంగళూరు వెళ్లే రైలు స్టేషన్‌లోకి వస్తుండటాన్ని గమనించిన ఆయన ఒక్కసారిగా ప్లాట్‌ఫామ్ నుంచి పట్టాలపైకి దిగి రైలు సమీపిస్తున్న తరుణంలో పట్టాలపై తలపెట్టి పడుకున్నారు. లోకో పైలట్ అప్రమత్తమై బ్రేకులు వేసినప్పటికీ, వేగంగా ఉన్న రైలు ఆయన మెడపై నుంచి దూసుకెళ్లింది. దీంతో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుడు వెంకటరమణ గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ లో కూడా బాధ్యతలు నిర్వహించారు. పదవీ విరమణ అనంతరం గజువాకలో ఒక సూపర్‌మార్కెట్‌ను ప్రారంభించారు. అయితే గత కొంతకాలంగా ఆ సూపర్‌మార్కెట్ నిర్వహణలో భారీగా నష్టాలు రావడం, ఆర్థిక భారం పెరగడంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయి వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతున్నాననే ఆవేదనలో ఆయన ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.
ఆర్థిక కష్టాలకు తోడు కుటుంబ సమస్యలు కూడా వెంకటరమణను తీవ్రంగా వేధించాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఆయన కుమార్తెల్లో ఒకరు ప్రస్తుతం ఒక కేసులో జైలులో ఉన్నారు. మరో కుమార్తె తన తండ్రి పరిస్థితిని వివరిస్తూ వ్యాపారంలో నష్టాలు, ఆర్థిక భారం కారణంగా ఆయన గత కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉన్నారని పోలీసులకు తెలిపారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
