
రైలులో మహిళపై అత్యాచారం
రైళ్లలో మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తించే మరో దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గుంటూరు, పెద్దకురపాడు రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న ఓ మహిళను కత్తితో బెదిరించి, అత్యాచారం చేసి ఆమె దగ్గర ఉన్న డబ్బులు, మొబైల్ ఫోన్ దోచుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మహిళ అక్టోబర్ 13న మధ్యాహ్నం సమయంలో సంత్రాగాచి స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లోని మహిళల కోసం కేటాయించిన వెనుక బోగీలో ఎక్కి చర్లపల్లి వైపు బయలుదేరింది. ఆమె మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోగీలో ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం, రైలు గుంటూరులో ఆగిన సమయంలో సుమారు 40 ఏళ్ల వయస్సు గల ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ బోగీ వద్దకు వచ్చి తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. అది గమనించిన బాధితురాలు “ఇది లేడీస్ కోచ్” అని చెప్పినా, అతడు ఆమెను తలుపు తెరవమని బ్రతిమిలాడాడు. ఆపై దుండగుడు లోపలికి ప్రవేశించిన అనంతరం తలుపు లోపల నుంచి గడియవేసాడు.
ఇదే అదునుగా భావించి రైలు గుంటూరు నుంచి పెద్దకురపాడు స్టేషన్ మధ్య ప్రయాణిస్తుండగా, ఆ వ్యక్తి కత్తితో బెదిరించి మహిళపై లైంగిక దాడి చేశాడు. దాడి అనంతరం ఆమెను కొట్టివేసి మహిళా హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న రూ. 5,600 నగదు, మొబైల్ ఫోన్ దోచుకుని రైలు పెద్దకురపాడు స్టేషన్ సమీపానికి చేరుకోగానే, దుండగుడు కదులుతున్న రైలు నుంచి దూకి అక్కడినుండిపరారయ్యాడు. భయంతో ఉన్న బాధితురాలు తన ప్రయాణాన్ని కొనసాగించి చర్లపల్లి చేరుకున్నాక, సికింద్రాబాద్ ప్రభుత్వ రైల్వే పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఆమె ఫిర్యాదు ఆధారంగా జీరో ఎఫ్‌ఐఆర్ (నేరం ఎక్కడ జరిగినా కేసు నమోదు చేసే చట్టం) నమోదు చేశారు. అనంతరం కేసు తదుపరి విచారణ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని నడికుడి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం, గుంటూరు స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా చేసుకుని నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు దుండగుడిని గుర్తించడానికి విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. గుంటూరు,పెద్దకురపాడు రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ వీడియోలను పరిశీలిస్తున్నారు.
ఇలాంటి సంఘటనలు మరెన్నో
ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల ఫుడ్ డెలివరీ ఉద్యోగిని, ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణిస్తుండగా, ఒక వ్యక్తి మహిళల బోగీలో ఆమెపై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో బోగీలో మరో ప్రయాణికురాలు లేకపోవడంతో ఆమె ప్రాణభయంతో కదులుతున్న రైలు నుంచి దూకింది. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందింది.
అదేవిధంగా ఫిబ్రవరిలో తమిళనాడులోని కాట్పాడి సమీపంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రయాణిస్తున్న గర్భిణీ మహిళపై రైలులో ఒక వ్యక్తి లైంగిక దాడి చేయడానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆ దుండగుడు ఆమెను రైలులో నుంచి తన్నేసి పారిపోయాడు. తీవ్ర గాయాలతో బాధితురాలు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి తరలించారు.
