Let's talk: editor@tmv.in
రైలులోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ..సమయస్ఫూర్తి చాటిన రైల్వే సిబ్బంది

రైలులోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ..సమయస్ఫూర్తి చాటిన రైల్వే సిబ్బంది

Panthagani Anusha
7 ఏప్రిల్, 2026

రైలు ప్రయాణంలో ఒక్కసారిగా ప్రసవ వేదనతో విలవిల్లాడిన ఓ గర్భిణికి రైల్వే సిబ్బంది అండగా నిలిచారు. విజయవాడ డివిజన్‌కు చెందిన సిబ్బంది అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, రైలు కోచ్‌లోనే సురక్షిత ప్రసవం జరిగేలా చూసి మానవత్వాన్ని చాటుకున్నారు.

అలప్పుజా-ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ (నం.13352)లో ఆదివారం ఓ గర్భిణి తన కుటుంబ సభ్యులతో కలిసి బి-1 కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. రైలు అన్నవరం స్టేషన్ దాటిన కొద్దిసేపటికే ఆమెకు అకస్మాత్తుగా తీవ్రమైన ప్రసవ వేదనలు మొదలయ్యాయి. ఊహించని ఈ పరిణామంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే రైలులో విధుల్లో ఉన్న టికెట్ చెకింగ్ సిబ్బందిని ఆశ్రయించారు.

సమాచారం అందిన వెంటనే టిటిఐ (అమెనిటీస్) జి.జ్యోతి అత్యంత వేగంగా స్పందించారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ఆమె గర్భిణికి ధైర్యం చెబుతూ అందుబాటులో ఉన్న వనరులతోనే పురుడు పోశారు. అదే సమయంలో కమర్షియల్ కంట్రోలర్‌కు సమాచారం అందించి వైద్య సాయం కోసం ఏర్పాట్లు చేయవలసిందిగా కోరారు. జ్యోతి పర్యవేక్షణలో గర్భిణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

సమన్వయంతో సురక్షితంగా ఆసుపత్రికి..

తల్లీబిడ్డలకు మెరుగైన చికిత్స అందించడం కోసం రైల్వే సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారు. గమ్యస్థానం చేరుకునే వరకు వేచి చూడకుండా అత్యవసర పరిస్థితి దృష్ట్యా రైలును ఏలమంచిలి స్టేషన్ వద్ద నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న 108 అంబులెన్స్ ద్వారా వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఆపరేషన్‌లో బిపుల్ కుమార్, జుబేర్ ఖాన్ తదితర సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించారు.

ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఆపద సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన విజయవాడ డివిజన్ సిబ్బందిని పలువురు ఉన్నతాధికారులు ప్రయాణికులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.