
రైతు సంక్షేమంపై ప్రభుత్వాలకు పట్టింపేది?
భారతదేశంలో ప్రతి ఏటా డిసెంబర్ 23న జాతీయ కిసాన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పటికీ, రైతు జీవితంలో నిజమైన మార్పు మాత్రం ఇంకా అందని ద్రాక్షగానే మిగులుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని 2001 నుంచి కిసాన్ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నా, ఆ రోజు ఆశయాలు నేటికీ పూర్తిగా నెరవేరలేదన్న అభిప్రాయం రైతు వర్గాల్లో వ్యక్తమవుతోంది. దేశానికి అన్నం పెట్టే అన్నదాతే నేడు అత్యంత అనిశ్చిత వర్గంగా మారాడన్న వాస్తవం ప్రభుత్వాలు ప్రకటిస్తున్న సంక్షేమ పథకాల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వారి కష్టాలు తెలిసిన పాలకులు లేక రైతుల వెతలు నేటికి తీరడం లేదు.
రైతు సంక్షేమం – నినాదమా? నిజమైన కర్తవ్యమా
భారతదేశంలో సుమారు 50 శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా కేవలం 15 నుంచి 18 శాతం మధ్యే ఉండటం గమనార్హం. అంటే దేశ జనాభాలో సగం మంది చేస్తున్న శ్రమకు తగిన ఆదాయం దక్కడం లేదన్నది స్పష్టమవుతోంది. అలాగే జాతీయ గణంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా 2023లో 10,786 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో తెలంగాణలో సుమారు 56 మంది తనువు చాలించారు.
ఏటేటా పెరుగుతున్న పంటల సాగు ఖర్చులు
విత్తనాలు, ఎరువులు, డీజిల్ ధరలు, కూలీ వేతనాలు పెరుగుతున్నప్పటికీ, రైతుకు లభించే పంట ధరలు మాత్రం స్థిరంగా లేక తీవ్రంగా ఊగిసలాడుతున్నాయి. గతంలో 50 కేజీల 20–20–0–13 ధర రూ.1350 ఉండగా, 2025లో దాని ధర రూ.1450కి పెరిగింది. విత్తనం నా చేతుల్లో, పంట ఇంకొకరిఇ చేతుల్లో అని గద్దర్ అన్నట్లు రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదు. మధ్యలో దళారీలు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) వ్యవస్థ ఉన్నప్పటికీ, అన్ని పంటలకు అది వర్తించకపోవడం, ప్రభుత్వ కొనుగోళ్లు పరిమితంగా ఉండటంతో రైతు ఆదాయం భద్రమైన స్థాయికి చేరడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
వ్యవసాయం వైపు చూడని యువత
వ్యవసాయం నష్టం కలిగించే వృత్తిగా మారుతుందన్న భావన కారణంగా గ్రామీణ యువత ఈ రంగానికి దూరమవుతోంది. ప్రస్తుతం రైతుల సగటు వయస్సు 50 ఏళ్లకు పైగా ఉండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. యువత వ్యవసాయం వైపు రాకపోవడానికి ప్రధాన కారణాలుగా స్థిర ఆదాయం లేకపోవడం, వాతావరణంపై ఆధారపడే అనిశ్చితి, అప్పుల భారం వంటి కారణాలతో యువత పట్టణాల వైపు వలస బాట పడుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో వ్యవసాయ రంగమే సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ రైతు పథకాలు – గణాంకాలు
కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తోంది. వారికి పంట పెట్టుబడి అందించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా రూ.6,000ను మూడు విడతలుగా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 11 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. కానీ ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం అరకోరగా ఉండడం, పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా సాయం లేకపోవడంతో రైతులు నిట్టూరుస్తున్నారు. ఈ పథకంలో అందించే సాయాన్ని పెంచాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నా ఇప్పటి వరకు దానిపై పెదవి విప్పడం లేదు.
ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన
పంట నష్టపోయినప్పుడు రైతులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ బీమా పథకం అమలులో ఉంది. ఏటా 5 కోట్లకు పైగా రైతులు ఈ పథకం పరిధిలోకి వస్తుండగా, వేల కోట్ల రూపాయల క్లెయిమ్‌లు చెల్లించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో అధికారులు ప్రభుత్వం ఇచ్చిన పరిహారాన్ని క్లెయిమ్ చేసుకున్నారు. రాజస్థాన్ లో రూ.122 కోట్ల మేర స్కాం జరిగింది. మహారాష్ట్రలో సుమారు 4.14 లక్షల బోగస్ క్లెయిమ్ లు చేశారు. ఇంత అవినీతి జరుగుతున్నా, రైతులకు ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని మధ్యలోనే కాజేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదు.
సాయిల్ హెల్త్ కార్డు పథకం
2015లో ఈ పథకాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. భూమి నాణ్యత ఆధారంగా సరైన ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ పథకం అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 22 కోట్లకు పైగా మట్టి ఆరోగ్య కార్డులు జారీ అయ్యాయి. కానీ ఈ పథకంపై అనేక మంది రైతులకు అవగాహన లేదు. రైతులకు చెప్పాల్సిన అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పథకాలేమో గొప్పగా ప్రకటించినప్పటికీ దాని అమలులో చిత్తశుద్ధి లోపిస్తోంది.
ఈ-నామ్
వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధరలు లభించేందుకు ఆన్‌లైన్ మార్కెట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా 1,300కి పైగా వ్యవసాయ మార్కెట్లు ఈ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానమయ్యాయి. కానీ రైతులకు డిజిటల్ వ్యవస్థపై అవగాహన లేకపోవడం, మధ్యవర్తులు ఇంకా ఉండడం, నాణ్యతా ప్రమాణాల విషయంలో సరైన కొలమానం లేకపోవడం, అలాగే డబ్బు చెల్లింపులో ఆలస్యం కావడం, అన్ని పంటలకు మార్కెట్లు లేకపోవడం, రాష్ట్రాలు ఆసక్తి చూపకపోవడం వంటి తదితర కారణాలతో అర్ధాంతరంగా నిలిచిపోయింది.
తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు
రైతు సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు పొందింది.
రైతు బంధు పథకం కింద పంట పెట్టుబడికి ఏటా ప్రతి ఎకరాకు రూ.10,000 చొప్పున సహాయం గతంలో అధికారంలో ఉన్న బీఆర్ ప్రభుత్వం అందించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 56 లక్షలకుపైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతుండగా, ఇప్పటివరకు రూ.75 వేల కోట్లకు పైగా నిధులు పంపిణీ చేశారు. కానీ 2023లో రూ.12 వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాలలో ఒకసారి మాత్రమే రైతుభరోసా ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇక ఈ సాయం అందుతుందో లేదో తెలియని అయోమయ పరిస్థితిలో అన్నదాత ఉన్నాడు. రైతు మరణిస్తే అతడి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది దేశంలోనే ప్రత్యేకమైనదిగా నిలిచింది. కానీ ఫసల్ బీమా యోజనలో తెలంగాణ ప్రభుత్వం చేరలేదు. దీంతో రైతులు పరిహారం అందక తీవ్ర నష్టాల పాలవుతున్నారు.
పథకాలు ఉన్నా… అమలు పైనే సందేహాలు
పథకాలు ప్రకటిస్తున్నప్పటికీ, అవి క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలవడం లేదన్న ఆరోపణలు కొకొల్లలుగా ఉన్నాయి. చిన్న, సన్నకారు రైతులకు పథకాలపై సరైన అవగాహన లేకపోవడం, డిజిటల్ విధానాలపై అనుభవ లేమి, అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపించడం వంటి సమస్యలు ఇంకా వేధిస్తున్నాయి.
నేటికీ చేరుకోని కిసాన్ దినోత్సవ లక్ష్యం
కిసాన్ దినోత్సవం అసలైన లక్ష్యం రైతుకు గౌరవం, ఆదాయ భద్రత, వ్యవసాయాన్ని లాభసాటి వృత్తిగా మార్చడం. కానీ రైతు ఆత్మహత్యలు, అప్పుల భారంతో ఇబ్బందులు, వాతావరణ మార్పుల ముప్పు వంటి సమస్యలు నేటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదు. అన్నదాత సంతోషంగా లేకుంటే దేశ అభివృద్ధి అసంపూర్ణమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కిసాన్ దినోత్సవం ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా, ప్రతిరోజూ ప్రభుత్వ విధానాల్లో ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. పథకాలు సంఖ్యలో కాకుండా, రైతు జీవితంలో కనిపించే మార్పులోనే వాటి విజయాన్ని కొలవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
