Let's talk: editor@tmv.in
రైతు వ్యతిరేక విత్తన బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించాలి: కేటీఆర్

రైతు వ్యతిరేక విత్తన బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించాలి: కేటీఆర్

Pinjari Chand
12 డిసెంబర్, 2025

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విత్తన బిల్లును భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లు రైతులపై తీవ్రమైన భారం మోపుతుందని, కార్పొరేట్ కంపెనీలకే ఎక్కువ ప్రయోజనం చేకూరేలా నిబంధనలు రూపొందించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గురువారం సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడారు. కేటీఆర్ ఈ సందర్భంగా కీలకమైన విషయాలు వెల్లడించారు.

కార్పొరేట్ ప్రయోజనాలకే పెద్దపీట

విత్తనాల ధరలను కంపెనీలే నిర్ణయించేలా బిల్లు రూపొందించారని, రాష్ట్రాల అధికారాలను పూర్తిగా లాక్కుంటున్నారని ఆయన విమర్శించారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయే రైతులకు నిర్దిష్ట సమయంలో నష్టపరిహారం చెల్లించే గ్యారంటీ బిల్లులో లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల తయారీలో కంపెనీలపై కాకుండా విక్రేతలపైనే బాధ్యత వేసేలా నిబంధనలు ఉన్నాయని చెప్పారు. కంపెనీలపై కఠిన శిక్షలు, భారీ పెనాల్టీలు వంటి అంశాలు లేకపోవడం ప్రమాదకరమని పేర్కొన్నారు. దీంతో పాటు సాంప్రదాయంగా రైతన్నలే విత్తనాలను తయారు చేసుకొని పండించుకునే వ్యవసాయ సాంప్రదాయాలు ఇప్పటికీ అనేక చోట్ల ఉన్నాయని, అయితే ఇలాంటి రైతన్నల సమూహానికి ఈ బిల్లులో ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని అన్నారు. వీటితో పాటు విదేశాల నుంచి నేరుగా ఆయా కంపెనీలు ఎలాంటి విత్తన ట్రయల్స్ లేకుండానే దేశంలో తమ విత్తనాలను అమ్ముకునే విధంగా సులభమైన నిబంధనలు ఉన్నాయని, వీటి వలన దేశీయ విత్తన భద్రత, విత్తన సార్వభౌమత్వం ప్రమాదంలో పడుతుందని కేటీఆర్ అన్నారు.

దీంతో పాటు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా విత్తనాల ధరలను నిర్ణయించే విధంగా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయని, గతంలో మాదిరి విత్తనాల ధరల నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకుండా పోతుందని కేటీఆర్ అన్నారు.

ఈ అంశానికి సంబంధించి రాష్ట్రాలకు, రాష్ట్రంలోని వ్యవసాయ యూనివర్సిటీలకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేశారని అన్నారు. దీంతో పాటు ఈ మొత్తం బిల్లు రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయ రంగంలో కీలకమైన విత్తనాల అంశంపై కేంద్ర ఆధిపత్యానికి దారితీస్తుందని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు సొంత చట్టాలు చేసుకుని ముందుకు పోయే అంశాన్ని బలహీనం చేస్తుందన్నారు.వ్యవసాయ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా, రాష్ట్రాల చట్టపరమైన స్వాతంత్ర్యాన్ని బలహీనపరిచేలా బిల్లు రూపుదిద్దుకుందని ఆయన అన్నారు.

రైతు ప్రయోజనాలే ముఖ్యం

రైతే కేంద్రంగా ఉండే బిల్లు కావాలి. కంపెనీల కోసం కాదు. రైతు ప్రయోజనం, విత్తన సార్వభౌమత్వం, దేశీయ బయోసేఫ్టీకి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. పార్టీ తరఫున కేంద్రానికి సుదీర్ఘ ఫీడ్‌బ్యాక్ పంపించినట్లు పేర్కొంటూ, ఈ బిల్లును పూర్తిగా ఆపివేసి రైతు సంఘాలు, నిపుణులు, రాజకీయ పార్టీలతో కూలంకషమైన చర్చలు చేసిన తర్వాతే ముందుకు సాగాలని డిమాండ్ చేశారు.

తొందరలోనే వ్యవసాయశాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి అదనపు సూచనలు కేంద్రానికి అందజేస్తామని కేటీఆర్ తెలిపారు.

రైతు వ్యతిరేక విత్తన బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించాలి: కేటీఆర్ - Tholi Paluku