Let's talk: editor@tmv.in
రైతు భరోసా నిధుల విడుదల: 70 లక్షల మంది రైతులకు రూ.9,000 కోట్లు

రైతు భరోసా నిధుల విడుదల: 70 లక్షల మంది రైతులకు రూ.9,000 కోట్లు

Gaddamidi Naveen
23 మార్చి, 2026

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 70 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. 'రైతు భరోసా' పెట్టుబడి సాయం కింద మొత్తం రూ.9,000 కోట్లను రాబోయే 45 రోజుల్లో మూడు విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ప్రకటించారు. సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామంలో కేవలం 17 నెలల కాలంలో పూర్తి చేసిన ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ కీలక వివరాలను వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్న సీఎం, తమ ప్రభుత్వం సగటున రూ.5,500 కోట్లు రైతుల కోసం ఖర్చు చేస్తోందని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో అది రూ.2,700 కోట్లకు మాత్రమే పరిమితమైందని చెప్పారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

రైతు భరోసా నిధుల పంపిణీ షెడ్యూల్‌ను వివరించిన సీఎం, మొదటి విడతగా రూ.3,600 కోట్లు రేపే రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. తదుపరి 20 రోజుల్లో రూ.5,400 కోట్లు విడుదల చేసి, ఆ తర్వాత మరో 20 రోజుల్లో మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పారు. మొత్తం ప్రక్రియను 45 రోజుల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.

ఇక అంతర్జాతీయ పరిస్థితులపై కూడా సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎరువుల కొరత తలెత్తే అవకాశం ఉందని రైతులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరా పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ విషయంపై ప్రధాని మోదీని కలుసుకుని రాష్ట్రానికి గరిష్టంగా ఎరువులు కేటాయించేలా ప్రయత్నిస్తామని తెలిపారు. ఎన్నికల తర్వాత రాజకీయాలకు చోటు లేకుండా రాష్ట్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యమని సీఎం వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగంలో మరో ముఖ్య అంశంగా పంటల విభజనపై సీఎం దృష్టి సారించారు. తెలంగాణలో 71 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు జరిగినప్పటికీ, కేంద్రం 50 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితమవుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులు లాభదాయకమైన పంటల వైపు మళ్లేలా చర్యలు అవసరమని సూచించారు.

రాష్ట్రంలో పండించే ప్రతి పంట రైతుకు లాభదాయకంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ, 10 లక్షల ఎకరాల్లో పండించే దిగుబడిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. రైతులకు నష్టపరిహారం అందజేయడంలో కూడా ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోందని సీఎం తెలిపారు. గత రెండు సంవత్సరాల్లోనే రైతుల సంక్షేమానికి రూ.1 లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇది రైతుల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని సీఎం అన్నారు.

విద్య, మహిళా సాధికారతపై కీలక నిర్ణయాలు

విద్యా రంగంపై కూడా సీఎం కీలక ప్రకటన చేశారు. రాబోయే విద్యా సంవత్సరంలో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ను ప్రారంభించి, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు పోటీగా నిలిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు అధునాతన శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఆయ‌న చెప్పారు.

నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి మించి తీర్చిదిద్దుతామని సీఎం హామీ ఇచ్చారు. విద్యార్థుల కోసం ఉదయం 'బ్రేక్ ఫాస్ట్' పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ కంటే సాంకేతిక నైపుణ్యానికి ప్రాధాన్యతనిస్తూ, అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయ‌న చెప్పారు. ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2,000 స్కాలర్‌షిప్ అందించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ బడుల్లో లక్షకు పైగా అత్యుత్తమ శిక్షణ పొందిన టీచర్లు ఉన్నారని, తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల మోజులో పడకుండా పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

మహిళా సాధికారతపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. పట్టణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యత్వాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే బ్యాంకు లింకేజీల ద్వారా మహిళా సంఘాలకు రూ.57,000 కోట్ల రుణాలు అందజేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలోని 12,728 గ్రామ పంచాయతీలకు నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామం ఒక గొప్ప రోల్ మోడల్. ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి పల్లె అభివృద్ధి చెందాలన్నారు. కేవలం సంప్రదాయ పంటలే కాకుండా, రైతులకు లాభాలను తెచ్చిపెట్టే లాభసాటి పంటల వైపు మళ్లించేలా మనం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయ‌న తెలిపారు.

అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావుండకూడదు. అన్ని రాజకీయ పార్టీల మధ్య సమన్వయం ఉన్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను సాధించగలం. మనమందరం కలిసికట్టుగా ఉండి అభివృద్ధి పనులను పూర్తి చేసుకుందాం. ప్రజా ప్రభుత్వం ఏ ఒక్క నియోజకవర్గం పట్ల కూడా వివక్ష చూపదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీఎం సిద్ధిపేట జిల్లాలో రూ.775.72 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, విద్యా, మహిళా సాధికారత వంటి కీలక రంగాల్లో ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.

150 స్టాళ్లను పరిశీలించిన సీఎం

సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఏర్పాటు చేసిన 'రైతు మహోత్సవం' క్షేత్రస్థాయిలో సాగు విప్లవానికి నాంది పలికింది. ఈ ప్రదర్శనను సందర్శించిన సీఎం, అక్కడ ఏర్పాటు చేసిన 150 స్టాళ్లను ఆసక్తిగా పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 20న ప్రారంభమైన ఈ ఉత్సవంలో అత్యాధునిక వ్యవసాయ పరికరాలు, విత్తన రకాలు, సేంద్రీయ సాగు పద్ధతులను ప్రదర్శించారు.

స్టాళ్ల వద్ద ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలతో సీఎం మాట్లాడి, కొత్త రకం వంగడాలు వాటి దిగుబడి సామర్థ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, పురుగుమందుల పిచికారీలో ఆధునిక యంత్రాల పాత్రను ప్రతినిధులు సీఎంకు వివరించారు. ప్రదర్శనకు వచ్చిన రైతులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అందిస్తున్న సాయంపై వారి అభిప్రాయాలను అడిగారు. నర్మెట్టలో ఏర్పాటు చేసిన ఈ 150 స్టాళ్లు రైతులకు కేవలం ప్రదర్శనగా మాత్రమే కాకుండా, భవిష్యత్తు సాగుకు ఒక మార్గదర్శిగా నిలిచాయి.

ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.