Let's talk: editor@tmv.in
రైతు భరోసా నిధులు విడుదల చేయాలి: దండేపల్లిలో బీఆర్ఎస్ నిరసన

రైతు భరోసా నిధులు విడుదల చేయాలి: దండేపల్లిలో బీఆర్ఎస్ నిరసన

Gaddamidi Naveen
8 మార్చి, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి ఉన్న మూడు విడతల 'రైతు భరోసా' నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ పాల్గొని రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా విజిత్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన మూడు విడతల పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి అన్యాయం చేసిందని మండిపడ్డారు. గతంలో కేవలం మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే సాయం అందించి, మిగతా రైతులను విస్మరించారని ఆయన విమర్శించారు. రైతుల ఖాతాల్లో వెంటనే పెండింగ్ నిధులను జమ చేయాలని, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని డిమాండ్ చేశారు.

కలెక్టరేట్ ముట్టడి హెచ్చరిక

ప్రభుత్వం స్పందించని పక్షంలో మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రైతులతో కలిసి జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. రైతుల పక్షాన పోరాడటానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయ‌న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.