
రైతు నేస్తాన్ని మరింత బలోపేతం చేయాలి: మంత్రి తుమ్మల
రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న 'రైతు నేస్తం' కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వివిధ జిల్లాల రైతులతో నేరుగా ముచ్చటించి, వారి సమస్యలు, విజయగాథలను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో ముఖ్యాంశంగా యూరియా యాప్ అమలుపై మంత్రి స్వయంగా రైతులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. యాప్ ద్వారా ఎరువుల సరఫరా ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా మారిందని రైతులు తెలిపారు. ముఖ్యంగా యూరియా లభ్యత, సమయానికి సరఫరా వంటి అంశాలు సాగుకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, దళారుల సమస్యలు తగ్గాయని రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ వ్యవస్థ వల్ల రైతులకు నమ్మకం పెరిగిందని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి మంగళవారం నిర్వహించే ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని మరింత ప్రభావవంతంగా మార్చాలని అధికారులకు సూచించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందుగానే చర్చించాల్సిన అంశాలను నిర్ణయించాలని, ఆ అంశాలకు అనుగుణంగా రైతుల అనుభవాలు, విజయగాథలను క్షేత్రస్థాయిలో నేరుగా పొలాల నుంచే ఇతర రైతులు చూసేలా ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇలా చేస్తే ఒక రైతు అనుభవం మరొక రైతుకు మార్గదర్శకంగా మారుతుందని మంత్రి తెలిపారు.
అదేవిధంగా, ఈ కార్యక్రమంలో ఇఫ్కో కంపెనీ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ కృపా శంకర్ నానో యూరియా వినియోగం, దాని ప్రయోజనాలు, సరైన వాడక విధానం గురించి రైతులకు సమగ్రంగా వివరించారు. నానో యూరియా వలన ఖర్చు తగ్గడంతో పాటు దిగుబడులు మెరుగవుతాయని ఆయన పేర్కొన్నారు. పీజేటీఎస్ఏయూ నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ కిరణ్ బాబు, డాక్టర్ అరుణశ్రీ యాసంగి వరిలో వచ్చే పురుగులు, తెగుళ్లు వాటి సమర్థవంతమైన యాజమాన్యంపై శాస్త్రీయంగా అవగాహన కల్పించారు.
‘రైతు నేస్తం’ కార్యక్రమం సమర్థవంతంగా కొనసాగుతున్న తీరును మంత్రి ప్రశంసించారు. రైతులకు చేరువయ్యేలా అధికారులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని అభినందిస్తూ, రైతుల హాజరుపై మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎక్కువ మంది రైతులు పాల్గొనేలా ముందస్తు ప్రచారం, సమన్వయం పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
