
'రైతు నేస్తం' 88వ ఎపిసోడ్: ప్రకృతి వ్యవసాయం, నానో యూరియాపై రైతులకు దిశానిర్దేశం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన 'రైతు నేస్తం' కార్యక్రమం 88వ ఎపిసోడ్ విజయవంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 1,600 రైతు వేదికల ద్వారా రైతులు, వ్యవసాయ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ మార్గంలో ఈ ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరుకాగా, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్రమోహన్ రైతులకు అధికారులకు తగిన మార్గదర్శకాలను అందించారు.
ఈ సందర్భంగా వివిధ జిల్లాల రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. యాదాద్రి జిల్లాలోని వెలిమెల గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ పట్టభద్రుడు సందీప్ సహజ వ్యవసాయ పద్ధతులు, పంటల స్వయంమార్కెటింగ్ విధానాలపై వివరించారు. ఖమ్మం జిల్లా మల్లుపల్లి గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి వరి సాగులో రసాయన యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నిజామాబాద్ జిల్లా యువ రైతు, మాజీ సైనికుడు నవీన్ తన సహజ వ్యవసాయ అనుభవాలను పంచుకొని ఇతర రైతులకు ప్రేరణగా నిలిచారు. మహబూబ్‌నగర్ జిల్లా బాబూరావు తన దీర్ఘకాల అనుభవాన్ని వివరించారు.
జగిత్యాల జిల్లా గూడూరు గ్రామానికి చెందిన రామ్ రెడ్డి, ఖమ్మం జిల్లా నెలకొండపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ పంటల సాగులో ఎదురవుతున్న సమస్యలపై ప్రశ్నలు అడగగా, వ్యవసాయ శాస్త్రవేత్తలు సమగ్ర సమాధానాలు ఇచ్చి తగిన సూచనలు అందించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యువ రైతు సందీప్ సహజ వ్యవసాయంలో చూపుతున్న ఆసక్తిని, మహేందర్ రెడ్డి నానో యూరియా వినియోగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ స్థాయిలో సహజ వ్యవసాయం, నానో యూరియా వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనుబంధ శాఖల ద్వారా రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని సూచించారు.
అలాగే “ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా వచ్చే 4 నుంచి 9 వరకు నిర్వహించనున్న రైతు ఉత్సవాలలో రైతులు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని, నానో యూరియా, నానో డిఏపీ వంటి ఆధునిక ఎరువులతో పాటు సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని రైతులకు సూచించారు. రాబోయే రైతు ఉత్సవాలను ఉత్సాహభరితంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
