
రైతు చెంతకే ‘భూధార్’
రాష్ట్రంలో భూ పరిపాలన వ్యవస్థను పూర్తిగా ఆధునీకరిస్తూ, రైతులు, భూ యజమానులకు శాశ్వత యాజమాన్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. భూములకు సంబంధించిన ప్రతి అంగుళాన్ని డిజిటలైజ్ చేసి, వివాదాలకు తావులేకుండా స్పష్టమైన రికార్డులు అందించాలనే ఉద్దేశంతో ‘భూభారతి’ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేసిన ‘ధరణి’ వల్ల ఏర్పడిన సమస్యలు, చిక్కుముడులను విప్పేందుకే ఈ కొత్త చట్టం ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఐడీఓసీ సమావేశ మందిరంలో శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్‌డ్ సర్వేయర్లకు లైసెన్స్ పత్రాలను అందజేశారు. ఖమ్మం జిల్లాలో రెండో విడతగా అర్హత సాధించిన 47 మంది సర్వేయర్లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. క్షేత్రస్థాయిలో భూ సర్వేలు మరింత వేగంగా, పారదర్శకంగా జరగేందుకు లైసెన్స్‌డ్ సర్వేయర్ల వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు.
భూ సర్వే ప్రక్రియలో ఇప్పటివరకు ఉపయోగించిన టేపులు, గొలుసుల పద్ధతులకు స్వస్తి పలుకుతూ, అత్యాధునిక ‘రోవర్స్’ సాంకేతికతను వినియోగిస్తున్నామని మంత్రి వివరించారు. సెంటీమీటర్ల స్థాయిలో ఖచ్చితత్వం వచ్చేలా ఈ రోవర్స్ పనిచేస్తాయని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 600 రోవర్స్‌ను కొనుగోలు చేసి అన్ని జిల్లాలకు పంపిణీ చేశామని, 5,500 మంది శిక్షణ పొందిన లైసెన్స్‌డ్ సర్వేయర్లను మండలాల వారీగా భూ విస్తీర్ణాన్ని ఆధారంగా కేటాయించామని మంత్రి వెల్లడించారు.
ధరణి వ్యవస్థలో జరిగిన లోపాలపై సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయిందని, ఆ నివేదికలు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. త్వరలోనే మిగిలిన 31 జిల్లాల్లోనూ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. భూ రిజిస్ట్రేషన్లపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, భూభారతి పై బురద చల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు.
ధరణి లొసుగులను ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడిన వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఎంతటి వారైనా సరే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇలాంటి అక్రమాల నుంచి రైతులు, భూ యజమానులను రక్షించేందుకే భూభారతి పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థకి అప్పగించామని, త్వరలోనే ఈ వెబ్ పోర్టల్ ప్రజలకు అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు.
అదే సమయంలో హైదరాబాద్ నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని మంత్రి ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్, వైరా ఎమ్మెల్యే, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
