Let's talk: editor@tmv.in
రైతు కుమార్తె వివాహా వేడుకలకు రాహుల్‌గాంధీ

రైతు కుమార్తె వివాహా వేడుకలకు రాహుల్‌గాంధీ

Pinjari Chand
11 మార్చి, 2026

కాంగ్రెస్‌ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మంగళవారం హర్యానాలోని సోనిపట్‌ జిల్లాలో ఉన్న మదీనా గ్రామంలో ఒక రైతు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆ రైతు సంజయ్ మాలిక్‌ను రాహుల్ గాంధీ 2023లో మదీనా గ్రామంలో చేసిన అకస్మాత్తు పర్యటన సమయంలో కలిశారు. ఆ సమయంలో ఆయన రైతులతో కలిసి పొలాల్లో పనిచేస్తూ వ్యవసాయ కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం గ్రామానికి చేరుకున్న రాహుల్‌గాంధీకి కాంగ్రెస్‌ పార్టీ నేతలు స్వాగతం పలికారు. ఆయనకు దీపేందర్‌‌ సింగ్ హుడా సహా పలువురు పార్టీ నాయకులు వెంట ఉన్నారు. తెల్లటి టీ-షర్ట్‌, ఆకుపచ్చ రంగు ప్యాంట్‌ ధరించి వచ్చిన రాహుల్ గాంధీ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో మాట్లాడారు. స్థానిక సంప్రదాయ వంటకాలను కూడా ఆస్వాదించారు. గౌరవ సూచకంగా కుటుంబ సభ్యులు ఆయనకు తలపాగా కట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్టు చేస్తూ ‘రైతు సంజయ్ మాలిక్ కుమార్తె వివాహానికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారని పేర్కొంది.

2023లో మదీనా గ్రామంలో రైతులతో కలిసి పొలాల్లో పని చేసిన సమయంలో సంజయ్ మాలిక్ కుటుంబంతో రాహుల్ గాంధీ పరిచయం ఏర్పడింది. అప్పట్లో వారి కుటుంబ సంతోషాల్లో, దుఃఖాల్లో భాగస్వామి అవుతానని ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా ఈ వివాహానికి హాజరయ్యారని పార్టీ తెలిపింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ ఎంపీ దీపేందర్ సింగ్‌ హుడా కూడా ప్రస్తావిస్తూ ‘పెద్ద పారిశ్రామిక వేత్తల యజమానుల పెళ్లిళ్లకు వెళ్లే రాజకీయ నాయకుల కాలంలో, రెండు సంవత్సరాల క్రితం పొలంలో కలిసి వరి నాటిన రైతు సంజయ్ కుమార్తె వివాహానికి రాహుల్‌గాంధీ హాజరై తన మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2023 జూలైలో రాహుల్ గాంధీ మదీనా గ్రామానికి అకస్మాత్తుగా వెళ్లి రైతులతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన వరి నాటడంలో పాల్గొని, ట్రాక్టర్‌ నడిపి, పొలాల్లో పనిచేసిన మహిళా కార్మికులు తీసుకొచ్చిన భోజనం కూడా చేశారు.