Let's talk: editor@tmv.in
రైతుల సమస్యలు పరిష్కరించాలి: హరీష్‌రావు

రైతుల సమస్యలు పరిష్కరించాలి: హరీష్‌రావు

Gaddamidi Naveen
21 మార్చి, 2026

సిద్దిపేట నియోజకవర్గంలో రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. నర్మెట గ్రామంలో నిర్వహించిన రైతు మేళా కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని హరీష్‌రావు తీవ్రంగా విమర్శించారు. నర్మెట గ్రామంలో 725 మంది రైతులలో దాదాపు సగం మందికి రుణమాఫీ జరగలేదని, ఈ గ్రామానికే సుమారు రూ.3 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని తెలిపారు. అలాగే సిద్దిపేట నియోజకవర్గంలో 22,849 మంది రైతులకు రూ.300 కోట్లకు పైగా రుణమాఫీ డబ్బులు చెల్లించాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

రుణమాఫీ కోసం అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వం తగ్గిస్తూ చివరికి కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని, రూ.2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులు బ్యాంకుల్లో చెల్లింపులు చేసినప్పటికీ ఇప్పటివరకు వారికి మాఫీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకర్లు రూ. 51 వేల కోట్లు అవసరమని లెక్క తేల్చగా, ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 31 వేల కోట్లకు కుదించి, కేవలం రూ. 20 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి దేవుళ్లపై ప్రమాణం చేసి కూడా నూటికి నూరు శాతం రుణమాఫీ చేయడంలో విఫలమయ్యారని ఆయ‌న‌ విమర్శించారు.

అదేవిధంగా రైతు భరోసా నిధుల విడుదలలోనూ తీవ్ర ఆలస్యం జరుగుతోందని ఆయ‌న‌ తెలిపారు. 2024 వానకాలం, యాసంగి, 2025 యాసంగి సీజన్లకు సంబంధించిన మొత్తం రూ.170 కోట్ల వరకు సిద్దిపేట నియోజకవర్గానికి బకాయిలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ బకాయిల మొత్తం సుమారు రూ.25 వేల కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. వెంటనే ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు.

అకాల వర్షాలు, వడగళ్ల వానలతో పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి సాయం అందించడం లేదని మండిపడ్డారు. సిద్దిపేటలోనే వేలాది మంది రైతులు నష్టపోయినా పరిహారం అందలేదని అన్నారు. ఇక పంటల బీమా అమలు విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆయ‌న‌ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఎకరాకు పంటల బీమా అమలు చేయాలని, రైతు ఉత్సవాల సందర్భంగా అయినా ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా ఈ నెల 22న నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి రైతులకు అంకితం చేయనున్నారు. అదేవిధంగా రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి స్థానిక రైతులతో ప్రత్యక్షంగా ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం తొలి విడత రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ప్రత్యక్ష లాభం చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.

రైతుల సమస్యలు పరిష్కరించాలి: హరీష్‌రావు - Tholi Paluku