Let's talk: editor@tmv.in
రైతుల వద్దకే బ్యాంకులు చేరాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రైతుల వద్దకే బ్యాంకులు చేరాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రైతుల వద్దకే బ్యాంకులు చేరాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Gaddamidi Naveen
20 ఆగస్టు, 2026

తెలంగాణను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో బ్యాంకింగ్, ఆర్థిక రంగాలు కీలక భాగస్వాములు కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఈ వికాసం కేవలం ప్రభుత్వ వ్యయం ద్వారానే సాధ్యం కాదని, భారీ ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులు, బలమైన ఆర్థిక సంస్థలు, విస్తృతమైన ఆర్థిక మార్కెట్లు అవసరమని స్పష్టం చేశారు.

మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో జరిగిన 50వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రైజింగ్ 2047 అనేది కేవలం విజన్ డాక్యుమెంట్ మాత్రమే కాదని, అది తెలంగాణ ప్రజలతో చేసుకున్న అభివృద్ధి ఒప్పందమని ఆయన పునరుద్ఘాటించారు.

రైతులకు సకాలంలో రుణాలు

గ్రామీణ, వ్యవసాయ రంగాలే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పునాది అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రుణాలు పొందడానికి రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని, బ్యాంకింగ్ వ్యవస్థే స్వయంగా రైతుల చెంతకు వెళ్లాలని సూచించారు. డైరీ, మత్స్య పరిశ్రమ, తోటపెంపకం, ఆయిల్ పామ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అనుబంధ రంగాలను కూడా ప్రాథమిక పరపతి పరిధిలోకి తీసుకురావాలని కోరారు. అందించే రుణం సదరు రైతుకు సుస్థిరమైన అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా ఉండాలని స్పష్టం చేశారు. రైతు రుణం చెల్లించలేకపోతే కేవలం రికవరీ చర్యలకు మాత్రమే పరిమితం కాకుండా, వారి ఆదాయం ఎందుకు తగ్గిందో బ్యాంకులు విశ్లేషించాలని సూచించారు. జూన్ 2026 నాటికి బ్యాంకులు వ్యవసాయ రంగానికి రూ.52,337 కోట్ల రుణాలు అందించడం అభినందనీయమని, అయితే ఈ రుణాలు సకాలంలో అందడం అంతే ముఖ్యమని నొక్కి చెప్పారు.

రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఎంఎస్‌ఎంఈ రంగం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. పారిశ్రామికవేత్తలకు రుణం మంజూరు కావడం కంటే అవసరమైన సమయంలో నిధులు అందడం ముఖ్యమని పేర్కొన్నారు. దరఖాస్తు, మంజూరు, నిధుల విడుదలకు స్పష్టమైన కాలపరిమితులు ఉండాలని ఆదేశించారు. ప్రస్తుత త్రైమాసికంలో సీజీటీఎంఎస్ఈ కింద రూ.4,463 కోట్ల విలువైన 16,265 ప్రతిపాదనలు ఆమోదించడాన్ని అభినందించారు. ఈ పథకం కింద మంజూరైన రుణాలకు కొలేటరల్‌ పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని బ్యాంకులకు సూచించారు.

‘తెలంగాణ రైజింగ్‌-2047’లోని క్యూర్, ప్యూర్, రేర్ విధానాలకు అనుగుణంగా ప్రాంతాల వారీగా రుణ వ్యూహాలను రూపొందించాలని భట్టి కోరారు. క్యూర్ ప్రాంతాల్లో ఏఐ, లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా, ఏరోస్పేస్‌, స్టార్టప్‌లు, జ్ఞాన ఆధారిత రంగాలకు అధునాతన ఆర్థిక సహాయం అవసరమన్నారు. ప్యూర్ ప్రాంతాల్లో తయారీ, లాజిస్టిక్స్‌, గిడ్డంగులు, పారిశ్రామిక క్లస్టర్లు, గృహ నిర్మాణం, మౌలిక వసతులకు నిధులు అందించాలని సూచించారు. రేర్ ప్రాంతాల్లో వ్యవసాయం, ఆహార శుద్ధి, డెయిరీ, మత్స్య, గ్రామీణ పరిశ్రమలకు తక్కువ వడ్డీతో సకాలంలో రుణాలు అందించాలని చెప్పారు.

సామాజిక ఆర్థిక చేరిక & డిజిటల్ బ్యాంకింగ్

రాష్ట్రంలో 19.13 లక్షల జన్ ధన్ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖాతాలు తెరవడమే కాకుండా, వారిని పొదుపు, ఇన్సూరెన్స్, రుణ సదుపాయాల వైపు ప్రోత్సహించడమే నిజమైన ఆర్థిక చేరిక అవుతుందన్నారు. గ్రామాల్లో నిష్క్రియంగా ఉన్న బిజినెస్ కరస్పాండెంట్లను పునరుద్ధరించాలని లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు కేవలం బ్యాంక్ లింకేజీలకే పరిమితం కాకుండా "ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్" అందించి వారిని సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని కోరారు.

చివరగా, "తెలంగాణ రైజింగ్ 2047 బ్యాంకింగ్ రోడ్‌మ్యాప్" తయారు చేయాలని ప్రతిపాదించారు. ప్రభుత్వ పథకాల కింద బ్యాంకులకు రావాల్సిన రీయింబర్స్‌మెంట్లను సకాలంలో విడుదల చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఈఓ దివ్య, నాబార్డ్ సీజీఎం చిన్మయ్ కుమార్, ఎస్బీఐ సీజీఎం నీలేష్ ద్వివేది, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.