
రైతుల రక్షణకు కొత్త వ్యవసాయ చట్టాలు: శివరాజ్ సింగ్ చౌహాన్
రైతులకు బలమైన చట్టపరమైన రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త వ్యవసాయ చట్టాలను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ప్రకటించారు. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగుమందులతో రైతులను మోసం చేసే వారిపై ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని, కఠినమైన శిక్షాత్మక చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఒకరోజు పర్యటనకు వచ్చిన చౌహాన్, దుర్గ్ జిల్లాలోని గిర్హోలా, ఖాప్రీ గ్రామాల్లో రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. పొలాలలో రైతులతో చర్చించిన ఆయన, వ్యవసాయం ఎదుర్కొంటున్న సవాళ్లు, పంటల ఉత్పత్తి, ఆదాయాలు, ఆధునిక సాంకేతికత వినియోగంపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కష్టార్జితం, వారి పంటలు, వారి భవిష్యత్తుతో ఏ పరిస్థితుల్లోనూ రాజీ పడలేం. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగుమందులతో రైతులకు నష్టం కలిగించే వారిపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఇది కేవలం ఆర్థిక నేరం కాదు, రైతుల విశ్వాసానికి చేసే ఘోరమైన ద్రోహమని అన్నారు.
త్వరలో కొత్త వ్యవసాయ చట్టాలు
రైతులకు పూర్తి స్థాయి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు కొత్త వ్యవసాయ చట్టాలు త్వరలోనే తీసుకువస్తామని, వాటి ద్వారా రైతుల హక్కులు మరింత బలోపేతం చేస్తామని చౌహాన్ వెల్లడించారు. ఈ చట్టాలు రైతులను మోసాల నుంచి రక్షించే బలమైన కవచంలా పనిచేస్తాయని ఆయన చెప్పారు.
ఆధునిక వ్యవసాయంపై దృష్టి
గిర్హోలా గ్రామంలో నర్సరీలు, పొలాలు, సాగునీటి సదుపాయాలు, ఉద్యానవన సాగు విధానాలను పరిశీలించిన మంత్రి, ఖాప్రీ గ్రామంలో ‘కిసాన్ చౌపాల్’ కార్యక్రమంలో రైతులతో విస్తృతంగా చర్చించారు. ఛత్తీస్‌గఢ్ రైతులు సంప్రదాయ వ్యవసాయంతో పాటు ఆధునిక సాంకేతికతను వేగంగా స్వీకరిస్తున్నారని, ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. పాడి సాగుతో పాటు కూరగాయలు, ఉద్యానవన పంటల వైపు రైతులు మొగ్గు చూపడం వల్ల ఆదాయాలు గణనీయంగా పెరిగాయని రైతులు ఆయనకు వివరించారు. దీనిపై స్పందించిన చౌహాన్, పంటల వైవిధ్యీకరణే కాలానికి అవసరం అని అభిప్రాయపడ్డారు.
పథకాలు – సాంకేతికత
చిన్న, సన్నకారు రైతులకు పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని, సహజ విపత్తుల నుంచి రక్షణ కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలులో ఉందని తెలిపారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా వ్యవసాయంలో ఆవిష్కరణలు, ఉత్పాదకత పెరుగుతున్నాయని చెప్పారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, డ్రోన్ టెక్నాలజీ ద్వారా పంటల పర్యవేక్షణ, పురుగుమందుల పిచికారీ, ఖర్చుల తగ్గింపునకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సహజ వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్, నీటి సంరక్షణ ఆధారిత సాగు భవిష్యత్తు వ్యవసాయానికి దారి చూపుతాయని చౌహాన్ పేర్కొన్నారు.
రైతుల ఆదాయం పెంపే లక్ష్యం
వ్యవసాయం లాభదాయకంగా మారేలా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, బలమైన విధానాలు, ప్రభావవంతమైన చట్టాలు, ఆధునిక సాంకేతికత, రైతుల కృషితో దేశంలో కొత్త వ్యవసాయ విప్లవం సాధ్యమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ, రాష్ట్ర వ్యవసాయ మంత్రి రామ్‌విచార్ నేతం తదితరులు చౌహాన్‌తో కలిసి ఉన్నారు.
