
రైతుల ఆర్థికాభివృద్ధికి యాంత్రీకరణే మార్గం: మంత్రి దామోదర్ రాజనర్సింహ
రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సముదాయ ఆవరణలో నిర్వహించిన 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా, ఉద్యాన యాంత్రీకరణ పథకం కింద రైతులకు ఆయన మినీ ట్రాక్టర్లను పంపిణీ చేశారు.
ఈ పథకం ద్వారా ముగ్గురు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఒక్కోటి రూ.4.9 లక్షల విలువ గల 20 హెచ్‌పి సామర్థ్యమున్న మినీ ట్రాక్టర్లను 60 శాతం సబ్సిడీతో అందజేశారు. దీంతో రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి వచ్చి సాగు ఖర్చు తగ్గడమే కాకుండా పనితీరు మెరుగుపడుతుందని మంత్రి తెలిపారు.
వ్యవసాయం, ఉద్యాన రంగాల అభివృద్ధికి యాంత్రీకరణ అత్యంత అవసరమని ఆయన అన్నారు. చిన్న, సన్నకారు రైతులు ఆధునిక పద్ధతులను అనుసరించి వ్యవసాయ యంత్రాలను వినియోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని సూచించారు. రైతుల ఆదాయం పెరిగేలా ప్రభుత్వం వివిధ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని మంత్రి చెప్పారు.
రైతుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన సూచించారు. ఉత్పాదకతను పెంచేందుకు రైతులు ఎల్లప్పుడూ ఆధునిక పద్ధతులను అనుసరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వరరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
