
రైతులు ధైర్యంగా ఉండండి మీకు అండగా బీఆర్ఎస్ ఉంది: కేటీఆర్
తెలంగాణ రైతాంగం,ముఖ్యంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి సోయా రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రైతులు ప్రభుత్వాలు ఏవి పట్టించుకోవడం లేదని, పండిన పంటను అమ్ముకునే స్థాయిలో కూడా సహకారం అందడం లేదని కేటీఆర్‌కు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి, సోయా పంటలకు తేమ శాతం పేరుతో అన్యాయంగా నిరాకరిస్తున్నారని, కనీస మద్దతు ధర కూడా అందడం లేదని రైతులు తెలిపారు.
ఈ సందర్భంలో కేటీఆర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుంటే మార్కెట్ యార్డును ఎందుకు బంద్ పెట్టారని, తమ పర్యటనకు ప్రభుత్వం ఎందుకు అడ్డంకులు కల్పించిందని కేటీఆర్ ప్రశ్నించారు. పత్తి, సోయా రైతుల పరిస్థితి చరిత్రలో ఎప్పుడూ లేనంత దారుణంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.అకాల వర్షాలు, తీవ్రమైన చలితో పత్తిలో తేమ శాతం సహజంగానే పెరిగిందని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి 20నుంచి 22 శాతం తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేసేలా చేశామని, కానీ ఇప్పుడు 12 శాతం తేమ ఉన్న పంటను కూడా కొనడం లేదని ఆరోపించారు. రైతులు పంటలు అమ్ముకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంలేదని. ఇప్పటివరకు లక్ష క్వింటాళ్ల పత్తి కూడా కొనలేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.కిసాన్ కపాస్ యాప్ ద్వారా మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబితే మొబైల్ లేకుండా ఉన్న రైతులు ఏం చేయాలనే ప్రశ్నను కేటీఆర్ లేవనెత్తారు. ఆదిలాబాద్‌లో నెట్‌వర్క్ సమస్యలున్నాయని, ఇలాంటి పరిస్థితిలో యాప్ ఆధారిత కొనుగోలు రైతులకు మరింత కష్టమని ఆయన తెలిపారు.
సోయాబీన్ అమ్మకాల కోసం ఫింగర్ ప్రింట్ తప్పనిసరి చేయడం వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తల్లిదండ్రుల పేరులో ఉన్న పంటను పిల్లలు అమ్మినా కొనుగోలు చేయడం లేదని ఆయన విమర్శించారు. పత్తికి ఎకరాకు కేవలం 7 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని పెట్టిన షరతు అర్థరహితమన్నారు. ఆదిలాబాద్ భూసారంతో ఎకరానికి పది నుంచి పదిహేను క్వింటాళ్లు పండుతాయని, మరి మిగిలిన పంటను ఎక్కడ అమ్మాలి? అని ప్రశ్నించారు.రాష్ట్రంలో కరెంట్ సరఫరా నుంచి యూరియా అందుబాటు వరకు, ఇప్పుడు పంట అమ్మకాల దాకా తీవ్ర సమస్యలు నెలకొన్నాయని కేటీఆర్ ఆరోపించారు. దేశంలో అత్యుత్తమ పత్తి ఉత్పత్తి చేసే రాష్ట్రం తెలంగాణ అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటూ, దిగుమతి సుంకాలను తగ్గించడం రైతులపై దెబ్బ అని ఆయన అన్నారు.
పత్తి రైతుల సమస్యలపై సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఒక్క చర్చ కూడా జరగకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. పత్తి కొనుగోలు వేగవంతం చేయాలని సీసీఐ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చామని. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పండే పత్తి సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదు అని కేటీఆర్ తెలిపారు.
