
రైతులపై తప్పుడు కేసులు పెడితే ఉపేక్షించేది లేదు
గూగుల్ డేటా సెంటర్ భూ సేకరణలో రైతులకు తెలీకుండా కోర్టులో తప్పుడు కేసులు ఫైల్ చేసిన ఉదంతంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎయిర్ పోర్టులో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ సీఎంకు స్వాగతం పలికిన అనంతరం డేటా సెంటర్ భూసేకరణ ప్రగతిని.. ఆ ప్రాంత రైతుల అభిప్రాయాలను సీఎంకు వివరించారు. ప్రతిష్ఠాకరమైన ప్రాజెక్టుకు ఆటంకాలు సృష్టించే ఆలోచనతో వైసీపీ పెద్దల తరపున పని చేస్తున్న బినామీ విషయంలో గట్టి చర్యలకు సీఎం ఆదేశించారు.
రైతులకు తెలీకుండా వారి పేర్లతో కోర్టులో కేసు వేయడం.. ఆ పేర్లలో మృతి చెందిన రైతు పేరు ఉండడం పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. భూములిచ్చిన రైతులకు ఉద్యోగావకాశాలు, ఉపాధి కోసం షాపింగ్ కాంప్లెక్స్, ఇళ్ల నిర్మాణానికి 3 సెంట్ల స్థలం గురించి ఎమ్మెల్యే గంటా సీఎం దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. భూసేకరణ ప్రాంతాల్లో ఒకసారి పరిహారాన్ని ప్రకటించిన తర్వాత దాన్ని పెంచడమనేది ఎక్కడా లేదని.. కేవలం ఇక్కడ రైతుల అభ్యర్థన దృష్టిలో ఉంచుకుని రేటు పెంచామని గ్రహించాలని సీఎం పేర్కొన్నారు. త్వరితగతిన భూ సేకరణ పూర్తి చేయాలని సూచించారు.
