
రైతులను కాంగ్రెస్ విస్మరించింది: ప్రధాని మోడీ
కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటోందని, బంగ్లాదేశీ అక్రమ వలసదారులను అస్సాంలో స్థిరపడేలా చేసి ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆరోపణలు చేశారు. అస్సాంలోని డిబ్రూగఢ్ జిల్లాలో నమ్రూప్‌లో రూ.10,601 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎరువుల కర్మాగారాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అస్సాం పర్యటనలో భాగంగా రెండో రోజు జరిగిన ఈ సభలో మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అస్సాం ప్రజల గుర్తింపు, గౌరవం, అస్తిత్వం మీద ఎలాంటి పట్టింపూ లేదు. అడవులు, భూముల్లో అక్రమ వలసదారులను స్థిరపరిచి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడమే వారి లక్ష్యమని ఆరోపించారు. ఓటరు జాబితాల సవరణను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని పేర్కొన్న ప్రధాని అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఏ మంచి పనినైనా వ్యతిరేకిస్తుంది. బీజేపీ ప్రభుత్వం మాత్రం అస్సాం ప్రజల భూమి, గుర్తింపు, గౌరవాన్ని కాపాడటానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యం
నమ్రూప్‌లోని పాత ఎరువుల కర్మాగారాన్ని ఆధునీకరించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ప్రధాని విమర్శించారు. సాంకేతికత పాతబడిపోయి ఒక్కొక్క యూనిట్ మూతపడింది. రైతుల సమస్యలకు పరిష్కారం చూపించడంలో కాంగ్రెస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న నమ్రూప్ యూరియా కర్మాగారం సంవత్సరానికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రైతులకు పెద్ద మేలు చేస్తుందని, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ఉత్పత్తి ప్రారంభమైతే సరఫరా వ్యవస్థ మెరుగుపడి రవాణా ఖర్చులు తగ్గుతాయని చెప్పారు.
రైతులే దేశ ప్రగతికి పునాది
రైతులు బాగుంటేనే దేశం ముందుకు వెళ్తుందని ప్రధాని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని వివరించారు. 2014లో దేశంలో యూరియా ఉత్పత్తి 225 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ప్రస్తుతం అది 306 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని తెలిపారు. దేశానికి ఏటా 380 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉందని, ఆ లోటును భర్తీ చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అయితే అధిక దిగుబడుల కోసం నియంత్రణ లేని యూరియా వినియోగం వల్ల నేల సారాన్ని దెబ్బతీస్తుందని రైతులకు హెచ్చరించారు. భూమి తల్లిలాంటిది. దానిని కాపాడితేనే అది మనకు ఫలిస్తుందని వ్యాఖ్యానించారు.
ఈశాన్య అభివృద్ధి కీలకం
ఈశాన్య భారత అభివృద్ధి లేకుండా దేశ ప్రగతి సాధ్యం కాదని మోడీ అన్నారు. అస్సాంలో పారిశ్రామికీకరణ, రహదారులు, కనెక్టివిటీ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం యువతకు కొత్త కలలను నెరవేర్చే శక్తిని ఇస్తోందని తెలిపారు.
టీ గార్డెన్ కార్మికులకు లబ్ధి
అస్సాంలోని 7.5 లక్షల టీ తోట కార్మికులకు జన్‌ధన్ ఖాతాలు తెరవడం ద్వారా నేరుగా లబ్ధి చేకూరుతోందని, పారదర్శకత పెరిగిందని చెప్పారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బహుమతిగా అస్సాం బ్లాక్ టీని అందజేశామని కూడా మోడీ గుర్తు చేశారు.
పీఎం-కిసాన్ ద్వారా రూ.4 లక్షల కోట్లు
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇప్పటివరకు రైతుల ఖాతాల్లోకి రూ.4 లక్షల కోట్లకు పైగా నేరుగా నిధులు జమ చేశామని తెలిపారు. గతంలో యూరియా కోసం రైతులు లైన్లలో నిలబడి, పోలీస్ లాఠీచార్జ్‌లను ఎదుర్కొన్న పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అవన్నీ చరిత్రగా మారాయని చెప్పారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిన వ్యవస్థలను మేము అంకితభావంతో పునర్నిర్మిస్తున్నామని ప్రధాని మోడీ వివరించారు.
