

రైతులకు స్థిరమైన ఆదాయవనరు ఆయిల్ పామ్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
వ్యవసాయ ఆధారిత ఖమ్మం జిల్లా రైతులకు ఆయిల్ పామ్ సాగు ఒక గొప్ప పరివర్తనాత్మక అవకాశమని, దీని ద్వారా రైతులు అధిక ఉత్పాదకతతో పాటు మెరుగైన లాభాలను అర్జించవచ్చని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో సుమారు రూ. 300 కోట్ల పెట్టుబడితో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 'గోద్రెజ్ ఇంటిగ్రేటెడ్ పామ్ ఆయిల్ పరిశ్రమ'ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గోద్రెజ్ యాజమాన్య ప్రతినిధులతో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా అంటేనే వ్యవసాయానికి మారుపేరని, ఉమ్మడి జిల్లా విభజన తర్వాత ఇక్కడి ప్రజలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడ్డారని గుర్తుచేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ, పాలేరు, వైరా జలాశయాల నీటిపై ఆధారపడే స్థానిక ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటి వ్యవసాయంలో.. అధిక దిగుబడి, ఎక్కువ ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే ఎల్‌నినో, కరవు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ రైతులకు నమ్మకమైన, స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ఈ సాగును ప్రోత్సహించడానికి ఎకరాకు రూ. 4,000 నుంచి రూ. 45,000 వరకు సబ్సిడీలను అందిస్తోందని వెల్లడించారు.
దేశీయ ఉత్పత్తి - ఆర్థిక వ్యవస్థ బలోపేతం
భారతదేశానికి ఏటా దాదాపు 25 లక్షల మెట్రిక్ టన్నుల పామ్ ఆయిల్ అవసరం కాగా, ప్రస్తుతం 12 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగిలిన అవసరాల కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడటం వల్ల భారీగా విదేశీ మారక ద్రవ్యం తరలిపోతోందన్నారు. దేశంలో సాగును విస్తరిస్తే జాతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. దేశవ్యాప్తంగా 70 లక్షల ఎకరాల్లో సాగుకు అవకాశం ఉన్నా, ప్రస్తుతం 15 లక్షల ఎకరాల్లోనే సాగు జరుగుతోందని ఆయన అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1991–92 కాలంలో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి మొదటగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించారని, అప్పట్లో జరిపిన సర్వేల్లో ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, సత్తుపల్లి ప్రాంతాలు ఇందుకు అత్యంత అనుకూలమైనవిగా గుర్తించారని భట్టి విక్రమార్క గుర్తుచేసుకున్నారు. ఆనాడు నాటిన విత్తనమే నేడు సమగ్ర పరిశ్రమగా ఎదిగిందన్నారు. నాటి నుంచి నేటివరకు తెలంగాణ, దేశవ్యాప్తంగా ఈ సాగు 3 లక్షల ఎకరాలకు విస్తరించిందని, భవిష్యత్తులో మరింత వృద్ధికి ఇక్కడ అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 2023లో టన్నుకు రూ. 12,500 ఉన్న తాజా పండ్ల గెలల (పీపీబీ) ధర ప్రస్తుతం రూ. 23,000 కు పెరిగిందని, దీనిని బట్టి ఈ పంటకు ఉన్న ఆర్థిక విలువను రైతులు గమనించాలన్నారు.
కొణిజర్లలో 113 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టులో నర్సరీలే కాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, సీడ్ జెనెటిక్స్, సీడ్ గార్డెన్స్, మిల్లింగ్, రిఫైనింగ్ యూనిట్లు ఉన్నాయన్నారు. ఒకప్పుడు మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి విత్తనాలు దిగుమతి చేసుకునే స్థితి నుంచి, రాబోయే రోజుల్లో దేశం మొత్తానికి నాణ్యమైన ఆయిల్ పామ్ విత్తనాలను సరఫరా చేసే కేంద్రంగా కొణిజర్ల మారబోతోందని ఆయన ఆకాంక్షించారు. పరిశ్రమ అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా రోడ్డు కనెక్టివిటీని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
రైతులు సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా పారిశ్రామిక ప్రాసెసింగ్ ద్వారా వాణిజ్య పంటలు, విలువ ఆధారిత ఉత్పత్తుల వైపు మళ్లినప్పుడే "రైతే రాజు" అనే నినాదం నిజమవుతుందన్నారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందనడానికి, కేవలం 9 రోజుల్లోనే 'రైతు భరోసా' కింద రూ. 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడమే నిదర్శనమని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు.
