
రైతులకు శుభవార్త: వ్యవసాయ పనిముట్ల సబ్సిడీ నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే!
తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలకు సాగు ఖర్చులు తగ్గించి, యాంత్రీకరణను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వ్యవసాయ పనిముట్లపై ఇచ్చే సబ్సిడీ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే జమ చేసే విధానాన్ని పరిశీలించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.హైదరాబాద్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రానున్న ఖరీఫ్-2026 సీజన్ సన్నాహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.
నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు
ప్రస్తుతం రైతులు కొనుగోలు చేసిన వ్యవసాయ పనిముట్లకు 40 శాతం సబ్సిడీని కంపెనీలకు అందించే విధానం అమల్లో ఉందని, భవిష్యత్తులో రైతులకే నేరుగా నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. రైతులకు సబ్సిడీపై అందించే పచ్చిరొట్ట విత్తనాలను వచ్చే ఏప్రిల్ నెలాఖరు నాటికి సిద్ధంగా ఉంచేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతులకు విత్తనాల సరఫరాలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రైతు వేదికలకు సోలార్ వెలుగులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే ప్రణాళికను రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇందుకు రెడ్కో సంస్థ సహకారం తీసుకోవాలని చెప్పారు. మొదట ప్రయోగాత్మకంగా జంగారెడ్డిపల్లి, జనంపేట రైతు వేదికలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి వాటి పనితీరును పరిశీలించిన తర్వాత మొదటి దశలో రాష్ట్రంలోని సుమారు 1600 రైతు వేదికలలో వాటిని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అదేవిధంగా రానున్న ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి అవసరమైన ఎరువులను ముందుగానే సమకూర్చి నిల్వ ఉంచాలని మంత్రి అధికారులకు సూచించారు. ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన ఎరువుల కేటాయింపుల కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని సూచించారు.
నీటి నిల్వలు సమృద్ధిగా ఉండటం, నేలలో తేమ నిల్వ ఉండటం, అలాగే దక్షిణ పశ్చిమ రుతుపవనాలు సాధారణంగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రానున్న ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో సుమారు 60.60 లక్షల హెక్టార్లలో సాగు జరిగే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్–2026 సీజన్‌కు రాష్ట్రానికి 11.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.
