
రైతునేస్తం 100వ ఎపిసోడ్.. తక్కువ నీటి పంటలపై దృష్టి పెట్టాలి: మంత్రి తుమ్మల
రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను నేరుగా చేరవేసి, శాస్త్రీయ సాగుపై అవగాహన పెంచడమే 'రైతునేస్తం' కార్యక్రమం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ సచివాలయంలో మంగళవారం నిర్వహించిన రైతునేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు, శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,600 రైతువేదికల ద్వారా లక్షలాది మంది రైతులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
మంత్రి తుమ్మల మాట్లాడుతూ గతంలో నిరుపయోగంగా ఉన్న రైతువేదికలను వీడియో కాన్ఫరెన్స్ సదుపాయంతో విజ్ఞాన కేంద్రాలుగా మార్చి రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. 2024 మార్చి 6న ప్రారంభమైన ఈ కార్యక్రమం నేటితో 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుందని, ఇప్పటివరకు 24.85 లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా పాల్గొనగా, వారిలో 5.26 లక్షల మంది మహిళా రైతులు ఉన్నారని వెల్లడించారు. రెండేళ్లలో 2.43 లక్షల మంది అధికారులు పాల్గొనగా, మొత్తం 27.30 లక్షల మందికి పైగా రైతులు ప్రయోజనం పొందినట్లు వివరించారు.
ప్రతి మంగళవారం ఉదయం నిర్వహించే రైతునేస్తం ద్వారా రైతులు అడిగే ప్రశ్నలకు శాస్త్రవేత్తలు తక్షణమే సమాధానాలు ఇస్తున్నారని, దీంతో పంటలకు నష్టం కలగకముందే సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేయాలని సూచించారు. ఎల్-నినో ప్రభావం, తక్కువ వర్షపాతం దృష్ట్యా అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ఆయిల్ పామ్, ఉద్యాన, ఆరుతడి పంటలను పరిశీలించాలని రైతులకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ రైతు, శాస్త్రవేత్త, అధికారుల మధ్య ప్రత్యక్ష అనుసంధానాన్ని కల్పిస్తున్న దేశంలోనే తొలి డిజిటల్ వేదికగా రైతునేస్తం నిలిచిందని ప్రశంసించారు. ఎల్-నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూపొందించిన కంటింజెన్సీ ప్రణాళిక ప్రకారం రైతులకు అవసరమైన విత్తనాలు, సాంకేతిక సూచనలు, ఇతర సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో పలువురు ఆదర్శ రైతులు రైతునేస్తం ద్వారా పొందిన శాస్త్రీయ అవగాహనతో దిగుబడులు, ఆదాయం పెరిగిందని తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమం ముగింపులో వివిధ జిల్లాల నుంచి ఎంపికైన ఆదర్శ రైతులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘనంగా సన్మానించారు.
