Let's talk: editor@tmv.in
రైతాంగ శ్రేయస్సు కోసం వరుణ యాగం.. వర్షాభావంపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన పొన్నం ప్రభాకర్
రైతాంగ శ్రేయస్సు కోసం వరుణ యాగం.. వర్షాభావంపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన పొన్నం ప్రభాకర్
రైతాంగ శ్రేయస్సు కోసం వరుణ యాగం.. వర్షాభావంపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన పొన్నం ప్రభాకర్

రైతాంగ శ్రేయస్సు కోసం వరుణ యాగం.. వర్షాభావంపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన పొన్నం ప్రభాకర్

Dantu Vijaya Lakshmi Prasanna
24 జులై, 2026

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రైతాంగం ఆందోళన చెందుతున్న వేళ, రాష్ట్ర ప్రజల సంక్షేమం, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి ముందుగా హుస్నాబాద్‌లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజల సంక్షేమం, రైతాంగ శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప ఆలయంలో 108 మంది రుత్వికులు, 21 హోమగుండాలతో నిర్వహించిన శ్రీ వారాహి మూలమంత్ర హోమ మహాయజ్ఞంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

తదుపరి శ్రీకృష్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, మరకత శివాలయంలో 108 కలశాలతో నిర్వహించిన వరుణ యాగంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, జలాశయాలు నిండిపోవాలని, రైతుల పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఆలస్యమవుతున్నాయని, దీనివల్ల రైతాంగం ఆందోళనకు గురవుతోందని అన్నారు. అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి వ్యవసాయం పుంజుకోవాలని, రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల సంక్షేమంతో పాటు "సర్వేజనా సుఖినో భవంతు" అనే భావనతో సమాజ శ్రేయస్సు కోసం కూడా ప్రార్థించాలని మంత్రి పిలుపునిచ్చారు. రైతు అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, రైతు బాగుంటేనే వ్యాపారులు, కార్మికులు, చేతివృత్తులవారు సహా సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

వారాహి అమ్మవారి కృపాకటాక్షంతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యాలతో ఉండాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని కోరుకున్నారు. మహాయజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న వేద పండితులు, నిర్వాహకులు, యజ్ఞ దంపతులను మంత్రి అభినందించారు.

అనంతరం హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు, సాగునీరు, పశుగ్రాసం వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు హైమవతి, చిత్రా మిశ్రా, చాహత్ బజ్‌పేయి, అదనపు కలెక్టర్లు, మూడు జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమాల్లో హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వేద పండితులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.