
‘రైట్ టు రీకాల్’ అమలు చేయాలి: ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా
ఎన్నికైన ప్రజాప్రతినిధులు సరిగా పనితీరు కనబరచకుంటే వారి పదవీకాలం పూర్తయ్యేలోపే ఓటర్లకు తిరిగి పిలిచే (రైట్ టు రీకాల్) హక్కు కల్పించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చడ్డా బుధవారం రాజ్యసభలో కోరారు. జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆయన, ప్రస్తుతం భారత రాజ్యాంగం ప్రజలకు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకునే హక్కు ఇస్తున్నప్పటికీ, పనితీరు లోపం లేదా అక్రమాల నేపథ్యంలో వారిని మధ్యలోనే తొలగించే ప్రత్యక్ష వ్యవస్థ లేదని అన్నారు.
‘రైట్ టు రీకాల్’ విధానం అమలులోకి వస్తే, నియోజకవర్గ ఓటర్లు చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా ఎన్నికైన ప్రతినిధిని తిరిగి వెనక్కి పిలిచే అవకాశం ఉంటుందని తెలిపారు. భారతదేశంలో ఇప్పటికే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, న్యాయమూర్తులపై ఇంపీచ్‌మెంట్ విధానం, ప్రభుత్వాలపై అవిశ్వాస తీర్మానాలు ఉన్నాయని గుర్తుచేశారు. అదే విధంగా వ్యక్తిగత శాసనసభ్యులపైనా బాధ్యతను నిర్ధారించే విధానం అవసరమని పేర్కొన్నారు.
ఐదేళ్ల పదవీకాలం అనేది చాలా దీర్ఘకాలం. ఏ వృత్తిలోనూ ఐదేళ్లు పనితీరు సరిగా లేకపోతే చర్యలు తీసుకుంటారని చడ్డా వ్యాఖ్యానించారు. అమెరికా, స్విట్జర్లాండ్ సహా ప్రపంచంలోని 20కి పైగా ప్రజాస్వామ్య దేశాల్లో వివిధ స్థాయిల్లో రీకాల్ విధానం అమలులో ఉందని ఆయన తెలిపారు. అయితే ఈ విధానాన్ని దుర్వినియోగం చేయకుండా రక్షణ చర్యలు అవసరమని చెప్పారు. కనీసం నియోజకవర్గంలో నమోదైన ఓటర్లలో 35–40 శాతం మంది మద్దతుతో ధృవీకరించిన పిటిషన్ వచ్చినప్పుడే రీకాల్ ప్రక్రియ ప్రారంభమవ్వాలని సూచించారు. అలాగే ఎన్నికల అనంతరం కనీసం 18 నెలల ‘కూలింగ్ ఆఫ్’( తప్పనిసరి విరామ కాలం)
వ్యవధి ఉండాలని అభిప్రాయపడ్డారు.
రీకాల్ కారణాలు అవినీతి నిరూపణ, అక్రమాలు, విధులపట్ల తీవ్రమైన నిర్లక్ష్యం వంటి అంశాలకు మాత్రమే పరిమితం కావాలని, సాధారణ రాజకీయ విభేదాల ఆధారంగా కాకూడదని అన్నారు. తుది ఓటింగ్‌లో 50 శాతం కంటే ఎక్కువ మంది మద్దతు ఇస్తేనే తొలగింపు అమలులోకి రావాలని సూచించారు.
ఇదే జీరో అవర్‌లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన జావేద్ అలీ ఖాన్ వీధి కుక్కలు, కోతుల దాడుల సమస్యను ప్రస్తావించారు. జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా దర్బంగా విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచాలని కోరారు. కాంగ్రెస్ సభ్యుడు అశోక్ సింగ్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల మధ్యప్రదేశ్ సోయాబీన్ రైతులపై ప్రభావం అంశాన్ని లేవనెత్తారు. బీజేపీకి చెందిన సభ్యులు డిజిటల్ మీడియా దుర్వినియోగం, మీరట్‌లో ఎయిమ్స్ ఏర్పాటు వంటి అంశాలను ప్రస్తావించారు.
