Let's talk: editor@tmv.in
రేషన్ పంపిణీ లో ఆక్రమాలపై వై ఎస్ ఆర్ సి పి ఫిర్యాదు …

రేషన్ పంపిణీ లో ఆక్రమాలపై వై ఎస్ ఆర్ సి పి ఫిర్యాదు …

Dantu Vijaya Lakshmi Prasanna
12 నవంబర్, 2025

గతంలో మాజీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఇంటింటికీ రేషన్ పారదర్శకంగా పంపిణీ జరిగేది. కూటమి ప్రభుత్వం రేషన్ సరఫరా పూర్తిగా డీలర్‌షిప్ ఆధారంగా పనిచేసేలా మార్చేశారు. అందులోనూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకే డీలర్‌షిప్‌లు ఇవ్వబడ్డాయి. దీని వలన రేషన్ పంపిణీ పేద ప్రజలకు కాకుండా అక్రమంగా బ్లాక్ మార్కెట్ కు తరలిపోవడం జరుగుతోందంటూ రేషన్ పంపిణీ లో అక్రమాలపై పులివెందుల మున్సిపల్ ఇంఛార్జ్ మనోహర్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ నేతలు పులివెందుల ఆర్డీవో కు వినతిపత్రం అందజేసారు.

ప్రస్తుతం, వారం నుంచి 10 రోజులు ఇవ్వాల్సిన రేషన్‌ను కేవలం 2–3 రోజులపాటే పంపిణీ చేస్తున్నారు. రేషన్ పొందుతున్న మొత్తం ప్రజలు 50 - 60% మాత్రమే. రేషన్ దుకాణాల్లో రేషన్ సరుకులు 2- 3 కిలోలు తక్కువగా ఇవ్వడం జరుగుతోంది. అనేక మంది డీలర్లు రేషన్‌ను ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం వ్యాప్తిలో ఉంది. పేదలు కూలీ పనులకు వెళ్లకుండా క్యూ లైన్ లలో నిలబడి వేచిచూసినా రేషన్ దొరకక ఖాళీ చేతులతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఈ పరిస్థితుల వలన తీవ్రంగా బాధపడుతున్నారు. ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇంతకుముందు ప్రభుత్వ హయాంలో లభించిన పారదర్శకత ఇప్పుడు కనబడడం లేదు. ప్రజలకు ఉన్న కనీస హక్కులైన రేషన్ కూడా అన్యాయంగా, వివక్షతో ఇవ్వబడుతోంది. ఈ పరిస్థితులపై మేము ప్రజల తరఫున మాట్లాడి, పేద ప్రజల ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయడం మా బాధ్యతగా భావిస్తున్నాం. అందువలన ఈ ప్రజా సమస్యలను మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతోంది, కావున వెంటనే ఈ పరిస్థితిపై దర్యాప్తు జరిపి ప్రజలకు రేషన్ సక్రమంగా అందేలా పర్యవేక్షణ చేయాలని, అక్రమ రేషన్ తరలింపులపై విచారణ జరపాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డీలర్లపై చర్యలు తీసుకోవాలని వినమ్రంగా కోరుకుంటున్నాం అంటూ వినతి పత్రంలో రాశారు.

రేషన్ పంపిణీ లో ఆక్రమాలపై వై ఎస్ ఆర్ సి పి ఫిర్యాదు … - Tholi Paluku