
రేవంత్ రెడ్డి వచ్చాక భూముల ధరలు పాతాళానికి పడిపోయాయి: హరీష్ రావు
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు తూప్రాన్ మున్సిపాలిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా అల్లాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రజాసభలో ఆయన ప్రసంగించి, అనంతరం తూప్రాన్ బస్టాండ్ వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకు స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తరువాత బస్టాండ్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ తూప్రాన్ అభివృద్ధిలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పనులను గుర్తు చేశారు.
ఒకప్పుడు తూప్రాన్‌లో మంచినీళ్ల కోసం మహిళలు బిందెలతో రోడ్లపైకి వచ్చేవారని, కేసీఆర్ హయాంలోనే ఇంటింటికి నల్లా కనెక్షన్ వచ్చి నీళ్ల కష్టాలు తీరాయని హరీష్ రావు గుర్తు చేశారు. తూప్రాన్‌ను మున్సిపాలిటీ చేసింది, ఆర్డీవో ఆఫీస్ తెచ్చింది, ఫోర్ లైన్ రోడ్లతో హైవేలా మార్చింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పుణ్యమా అని ఇక్కడి భూముల ధరలు పది లక్షల నుంచి కోటికి చేరాయని, కానీ రేవంత్ రెడ్డి వచ్చాక భూముల ధరలు పాతాళానికి పడిపోయాయని విమర్శించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన, రెండేళ్లుగా తూప్రాన్ అభివృద్ధి నిలిచిపోయిందని ఆరోపించారు. రోడ్లు దెబ్బతిన్నా మరమ్మతులు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుబంధు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్, దళిత బంధు వంటి పథకాలు నిలిపివేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భూముల ధరలు తగ్గిపోయాయని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ నాయకుల ఆధిపత్య పోరు
తూప్రాన్‌లో కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి, మైనంపల్లి మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరులో ప్రజలు బలైపోతున్నారని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో ఒక్క రోడ్డు గుంత కూడా పూడ్చలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వాడుతున్న భాషపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్, తులం బంగారం ఎక్కడ అని అడిగితే.. లాగుల్లో తొండలు వేస్తా, గుడ్లు పీకి గోటీలు ఆడుతా అని ముఖ్యమంత్రి బూతులు మాట్లాడుతున్నారు అని ఆయన తెలిపారు.
బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్లే
పన్నెండేళ్లుగా రూ. 15 లక్షలు వేస్తామని బీజేపీ ప్రజలను మోసం చేస్తోందని, తూప్రాన్ కు ఆ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు. పువ్వు గుర్తుకు ఓటేయడం అంటే ఓటును మోరీలో పారేయడమేనని ఎద్దేవా చేశారు. సద్ది తిన్న రేవు తలవాలి.. మనకు అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోవద్దు అని పిలుపునిస్తూ, ఐదేళ్ల కోసం బీఆర్ఎస్ కౌన్సిలర్లను గెలిపిస్తే రెండేళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని, తూప్రాన్ అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
