
రేవంత్ రెడ్డి మాటల ఘనం – ఆచరణ శూన్యం!: హరీష్ రావు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పడంలో మాత్రమే ముందుందని, కానీ ఆచరణలో మాత్రం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ముఖ్యంగా విద్యాశాఖ పరిధిలో జరుగుతున్న నిర్లక్ష్యం, నిరుపేద ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వ అసమర్థతను బహిర్గతం చేస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం నియమించిన స్కావెంజర్లకు తొమ్మిది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుమాలిన చర్య! అన్నారు. చిరు ఉద్యోగుల శ్రమను గౌరవించడం బదులుగా వారిని వేతనాల కోసం ఇబ్బందులు పడేలా చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉందని ఆయన విమర్శించారు.అదేవిధంగా, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా తమ హక్కులైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. పదేళ్ల సేవ అనంతరం విశ్రాంతి తీసుకున్న వారిని ఇంతలా వేధించడం అన్యాయం, అని ఆయన పేర్కొన్నారు.
ఇక, పేద విద్యార్థుల కడుపు నింపే మధ్యాహ్న భోజన పథకం నిధులు కూడా ఏడాదిగా పెండింగ్‌లో ఉండటం మరో పెద్ద లోపంగా చేప్పరు. మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం నిలిపివేయడంతో పాటు మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించకపోవడం విద్యార్థుల పోషణా భద్రతపై ప్రభావం చూపుతుందన్నారు.
విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత శాఖలోనే వేతనాలు, బెనిఫిట్స్ సమస్యలు కొనసాగుతుండటం ప్రజలకు ఆవేశం కలిగిస్తోందన్నారు. ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైందని ఉద్యోగులు ఆవేదన వింటే మనస్సు చెలించిపోతున్నదని తెలిపారు.
ప్రజలకు, విద్యార్థులకు నేరుగా సంబంధించిన మధ్యాహ్న భోజన పథకం బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ బెనిఫిట్స్, అలాగే స్కావెంజర్ల తొమ్మిది నెలల వేతనాలు తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే, రేవంత్ ప్రభుత్వం మాటలకంటే ఆచరణలో చూపించాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
