Let's talk: editor@tmv.in
రేవంత్ రెడ్డి కేరళలో అబద్ధాలు చెప్తున్నారు: ఎన్. రామ‌చందర్ రావు
రేవంత్ రెడ్డి కేరళలో అబద్ధాలు చెప్తున్నారు: ఎన్. రామ‌చందర్ రావు

రేవంత్ రెడ్డి కేరళలో అబద్ధాలు చెప్తున్నారు: ఎన్. రామ‌చందర్ రావు

Gaddamidi Naveen
6 ఏప్రిల్, 2026

తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొరుగు రాష్ట్రమైన కేరళకు వెళ్లి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ‌చందర్ రావు విమర్శించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన ఘాటుగా స్పందించారు.

స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ సంఘ సంస్కర్త, బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్. రామ‌చందర్ రావు మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో బాబూ జగ్జీవన్‌రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. కార్యకర్తల్లో సిద్ధాంతపరమైన అవగాహన పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సుమారు 900 మండలాల్లో 600కు పైగా మండలాల్లో ఇప్పటికే ఈ కార్యక్రమాలు పూర్తి చేశామని చెప్పారు. మిగతా మండలాల్లో కూడా త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు.

కాంగ్రెస్ వైఫల్యాలు - తప్పుడు ప్రచారం

తెలంగాణలో రైతులకు ఇచ్చిన రుణమాఫీ సహా 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రామ‌చందర్ రావు ఆరోపించారు. ఇక్కడ హామీలు నెరవేర్చకుండానే, కేరళ ఎన్నికల ప్రచారంలో అన్ని అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ప్రజలను వంచించడమే. తెలంగాణ ప్రజాధనాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం ఆర్థిక వనరుగా వాడుకుంటోందని ఆయన మండిపడ్డారు. పేదల ఇళ్లు, చిన్న వ్యాపారాల కూల్చివేతలతో సామాన్యుల పొట్టకొడుతున్నారని విమర్శించారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని, ఏ వర్గం ప్రజలూ సంతృప్తిగా లేరని పేర్కొన్నారు.

మోడీ నాయకత్వంలో భారత్ సురక్షితం

ప్రపంచవ్యాప్తంగా ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా వంటి దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికత వల్ల భారత్ సురక్షితంగా ఉందని ఆయన కొనియాడారు. దేశంలో పెట్రోల్, గ్యాస్ కొరత ఉందంటూ కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్యాస్ కొరత, లాక్‌డౌన్ వంటి అపోహలు సృష్టించే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయ‌న డిమాండ్ చేశారు. రాబోయే జీహెచ్ఎంసీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా పోటీ చేసి విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అప్పటి వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని రామ‌చందర్ రావు పేర్కొన్నారు.