
రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
కొడంగల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కొడంగల్ ప్రజల జోష్ చూస్తుంటే రేవంత్ రెడ్డి కొడంగల్ లో పోటీ చేయకుండా పారిపోయేలా ఉన్నారు. ప్రజలకు కోపముంది. ఆయన్ని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకొని ఉన్నారని, రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కానీ కొడంగల్ కు మాత్రం తిరుపతి రెడ్డి సీఎం, రేవంత్ రెడ్డి కాదని విమర్శించారు. వార్డు మెంబరు, సర్పంచు, కౌన్సిలర్ కూడా కానీ తిరుపతి రెడ్డికి కలెక్టర్లు, ఎస్పీలు వంగి వంగి దండాలు పెడుతున్నారు. పోలీస్ ఎస్కార్ట్ తో ఆయన తిరుగుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కట్టించిన బిల్డింగులు, ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిలకు మాత్రం రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డిలు రిబ్బన్ కట్ చేస్తున్నారు అందుకే జేబులో కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నారు. జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్న రేవంత్ రెడ్డి కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఒక్క హామీని అమలు చేయలేదు
అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క మంచి పని కూడా చేయలేదని, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సంతకంతో గ్యారెంటీ కార్డులను ఇచ్చి కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. కానీ అధికారంలోకి వచ్చాక ఇప్పటిదాకా అందులోని ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నదో చెబుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ బాకీ కార్డును తయారు చేసింది. రేవంత్ రెడ్డి ఎంత పెద్ద మోసగాడో కొడంగల్ ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని, తనకు రాజకీయంగా జన్మనిచ్చిన కొడంగల్ గురించి శాసనసభలో అడ్డదిడ్డంగా మాట్లాడారు. తొండలు కూడా గుడ్లు పెట్టని భూములు కొడంగల్లో ఉన్నాయంటూ అల్లుడి ఫ్యాక్టరీ కోసం భూములు తీసుకొని రైతుల పొట్టగొడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం?
కొడంగల్ ఏమైనా రేవంత్ జాగీరా? రాజువా?
కొడంగల్ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యేగా గెలిచావు. ఢిల్లీకి మూటలు పంపి ముఖ్యమంత్రి అయ్యావు. అహంకారపూరితంగా మాట్లాడిన ఎంతోమంది ఇవాళ అడ్రస్ లేకుండా కనుమరుగయ్యారు. కొడంగల్ ప్రజల ఆగ్రహంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కూడా అలానే అడ్రస్ లేకుండా కొట్టుకపోతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి మూడేళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను బ్రహ్మాండంగా బంపర్ మెజారిటీతో గెలిపించి బుద్ధి చెప్పండని పిలుపునిచ్చారు. రైతుల కోసం 40 రోజులు జైలుకుపోయిన నరేందర్ రెడ్డి ఒకవైపు, గెలిపించిన పాపానికి రోజు అవమానిస్తున్న తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డిలు ఇంకోవైపు ఉన్నారు. ఎవరూ కావాలో తేల్చుకోవాలన్నారు. ప్రజలు మళ్లీ మోసపోవద్దు. ఎంపీటీసీ అయినా, సర్పంచ్ అయినా, జడ్పిటిసి అయినా, అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, కొడంగల్ ఒక ఎత్తు. మళ్లీ కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఏ పని, ఏ హామీ అమలు చేయకపోయినా ప్రజలు తనను గెలిపించారని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఇక ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదని డిసైడ్ అవుతారు. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లు వేసేటప్పుడు రైతుబంధు పైసలు పడేవి, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లు వేసేటప్పుడు మాత్రమే రైతుబంధు పైసలు వేస్తున్నారు. ఏ సంక్షేమ పథకంలో కోతలు విధించాలా? అని ప్రతిరోజు ఆలోచిస్తున్నారు. లగచర్ల-హకీంపేట తండాలో ఆడపిల్లలను ఎంతగా అవమానించారో ప్రజలు మర్చిపోవద్దని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి సోదరులంతా భూముల దందాలో బిజీగా ఉన్నారు. ఈ ఐదేళ్లు దోచుకోవడమే లక్ష్యంగా పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నారు.
పది రెట్ల వ్యయం పెంచారు
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 15 వేల కోట్లతో మూసి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రణాళికలు వేశారు. రేవంత్ రెడ్డి 1,50,000 కోట్లతో మూసి సుందరీకరణ ప్రాజెక్టును మొదలుపెట్టి దాన్ని పది రెట్లకు పెంచారు. వందేళ్ల కింద మూసికి వరదలు వస్తే అప్పటి నిజాం ప్రభువు ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్ చెరువులను కట్టించారు. వాతావరణ శాఖ హెచ్చరికలు రాగానే ఆ రెండు చెరువుల నీళ్లను ఖాళీ చేసి మూసి వరదలు అందులో పట్టి ఉంచాలి. అప్పుడు హైదరాబాద్ కు వరద తగ్గుతుంది. కానీ మూసి ప్రాజెక్టు ఎలాగైనా చేయాలన్న దురుద్దేశంతో ఆ రెండు చెరువులను ఖాళీ చేయకుండా కావాలని ఇవాళ వరదలు వచ్చేలా చేస్తున్నారు. చరిత్రలో తొలిసారిగా ఎంజీబీఎస్ బస్టాండ్ కి వరద వచ్చింది. ఇలా ఇంతకుముందు ఎప్పుడు కాలేదు. రూ. 1,50,000 కోట్ల రూపాయలను దోచుకోవడానికి హైదరాబాద్ ప్రజలను వరదలో ముంచిండు.
90 శాతం పని పూర్తి చేసింది కేసీఆర్
మొత్తం రిజర్వాయర్లను కట్టిండు. నార్లాపూర్, వట్టెం, కరివేన, ఉద్దండపూర్ రిజర్వాయర్లను నిర్మించింది. ఐదు రిజర్వాయర్లు, పంప్ హౌస్ లు కూడా పూర్తయ్యాయి. ఒక పంపును బీఆర్ఎస్ హయాంలోనే స్టార్ట్ చేశాము. గోదావరి మీద కాళేశ్వరం ఎలాగైతే కట్టారో, కేసీఆర్ కృష్ణా మీద పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్లాన్ చేశారు. నారాయణపేట, కొడంగల్ కు కలిపి రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఉంది. శ్రీశైలం లో నీళ్లు తీసుకొని కొల్లాపూర్ నుంచి కొడంగల్ కు వరకు తీసుకొచ్చే పథకమే ఇదన్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందని 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని పక్కనపెట్టి పేరు పెట్టిన రేవంత్ రెడ్డి ఆ మిగిలిన 10% పనులను పూర్తి చేయడం లేదు.
జూరాల నుంచి కొడంగల్ కు నీళ్లు తీసుకొస్తానని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మొదలుపెట్టారు. కానీ ఆల్మట్టి ఎత్తు పెంచితే జూరాలకు చుక్క నీళ్లు రావు. రూ. 4,500 కోట్లతో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మొదలుపెట్టిండు. కమిషన్ల కోసం బాంబులేటి శ్రీనివాస్ రెడ్డికి, మెగా కృష్ణారెడ్డికి ఆ పనులను అప్పజెప్పారు. వెయ్యి కోట్ల రూపాయలను దోచుకోవడానికి ఇలా చేశారు. రేవంత్ రెడ్డి దోపిడీని కోర్టు అర్థం చేసుకుంది కాబట్టే స్టే ఇచ్చింది. నిరుపేదలు, గిరిజనులు, ముస్లింల మీద అసలు ఏ ఒక్కరి మీద కూడా రేవంత్ రెడ్డికి ప్రేమ లేదు. పేదల భూములు గుంజుకొని అల్లుడి కంపెనీ కోసం , అన్న తిరుపతి రెడ్డి కమిషన్ల కోసమే తప్ప.. కొడంగల్ నియోజకవర్గంలోని ప్రజల కోసం ఒక్క పని కూడా చేయడం లేదు. అన్నం పెట్టిన కొడంగల్ కు సున్నం పెట్టిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. ఇలాంటి వ్యక్తులు కొడంగల్ కే కాదు మొత్తం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కొడంగల్లో నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ప్రమోషన్ ఇస్తాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే యాత్ర కొడంగల్ నుంచే మొదలుపెట్టాలి.
