Let's talk: editor@tmv.in
రేవంత్ రెడ్డికి 'అబద్ధాల్లో ఆస్కార్' ఇవ్వాలి: కేంద్రమంత్రి బండి సంజయ్

రేవంత్ రెడ్డికి 'అబద్ధాల్లో ఆస్కార్' ఇవ్వాలి: కేంద్రమంత్రి బండి సంజయ్

Gaddamidi Naveen
5 ఏప్రిల్, 2026

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసిందని కేరళలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డికి అబద్ధాలు చెప్పడంలో ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేశామని రేవంత్ రెడ్డి నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ఒకవేళ అవి అబద్ధాలని నేను నిరూపిస్తే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని బండి సంజయ్ బహిరంగ సవాలు విసిరారు. ఏసీ హాల్‌లలో కూర్చుని మాట్లాడటం కాదని, కేరళ మీడియాను వెంటబెట్టుకుని తెలంగాణలోని గ్రామాలు, వీధుల్లో పర్యటిద్దామని ఆయన పిలుపునిచ్చారు.

మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, ఆసరా పెన్షన్లు రూ.4,000కు పెంపు, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డులు, కౌలు రైతులకు రూ.15,000 రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు రూ.12,000 వంటి హామీలు అమలు కాలేదని ఆయన ఆరోపించారు. అలాగే ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్, మహిళలకు స్కూటీలు, 10 గ్రాముల బంగారం వంటి హామీలు ఎక్కడున్నాయని ఆయ‌న ప్రశ్నించారు.

ఇప్పటికే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో కూడా ఇలాంటి అబద్ధాలనే విక్రయించే ప్రయత్నం చేశారని, ఇప్పుడు ఆ తెలంగాణ కాంగ్రెస్ అబద్ధాలను కేరళకు ఎగుమతి చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేరళ మీడియా ప్రతినిధులు ఒక్కసారి తెలంగాణకు వచ్చి ఇక్కడి రైతులు, నిరుద్యోగ యువతతో మాట్లాడితే అసలు నిజం ఒక్క రోజులోనే బయటపడుతుందని ఆయన కోరారు. కేవలం అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీని రక్షించుకోలేరని ఆయన హెచ్చరించారు.