
రేవంత్ పాలనలో కాంగ్రెస్ నేతల కమిషన్ల దందా.. త్వరలో భారీ పాదయాత్ర: హరీష్ రావు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి టి. హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెట్టినా వెంటనే చర్యలు తీసుకునే పోలీసులు, మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు సైకో రాజ్‌కుమార్‌ను 40 రోజుల పాటు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ నేతల సెటిల్మెంట్ కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఒక కాంగ్రెస్ నేత రూ. 20 లక్షలు తీసుకుని నిందితుడికి బెయిల్ ఇప్పించాడని, ఆ అండతోనే వాడు బయటకు వచ్చి ఆరుగురిని క్రూరంగా, విచక్షణారహితంగా హత్య చేశాడని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రజల్లో ఆందోళన పెరిగిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని హరీష్ రావు విమర్శించారు. చట్టం అందరికీ సమానమైతే ముఖ్యమంత్రిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో రైతులకు సాగునీరు అందించే చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల పేరుతో నీటిని ఖాళీ చేసి, వానాకాలం వచ్చినా పనులు పూర్తి చేయలేదని ఆరోపించారు. దీంతో తాగునీటి సమస్యలు మరింత పెరిగాయని అన్నారు. ఎన్నికల ముందు ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేంద్రం చెప్పిన మేరకే కొనుగోళ్లు చేస్తోందని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే, నేడు అది 8 గంటలకు పడిపోయిందని విమర్శించారు. దేవుళ్ల మీద ఒట్లు వేసి రుణమాఫీ ఎగ్గొట్టారని, రైతుబంధు కింద రైతులకు రూ. 19 వేల కోట్లు ఎగవేశారని ఆరోపించారు. ఎల్ఐసీ ప్రీమియం కట్టకుండా రైతు బీమాను కూడా ఆపేశారన్నారు. బడులు తెరిచి నెల రోజులైనా పుస్తకాలు, యూనిఫామ్‌లు ఇవ్వలేదని, 20 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బంద్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు లేవంటూనే మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ, అందాల పోటీలకు లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు.
నారాయణఖేడ్, ఆందోల్ ప్రాంతాల సాగునీటి అవసరాల కోసం ప్రతిపాదించిన సంగమేశ్వర–బసవేశ్వర ప్రాజెక్టు పనులను ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించిన హరీష్ రావు, ఆ ప్రాజెక్టుల సాధన కోసం త్వరలో భారీ పాదయాత్ర చేపడతామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మెదక్ జిల్లాలోని 10 కి 10 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
