Let's talk: editor@tmv.in
రేవంత్ నల్లమల్ల గుంటనక్క

రేవంత్ నల్లమల్ల గుంటనక్క

Pinjari Chand
29 సెప్టెంబర్, 2025

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కృష్టానది మీద ఉన్న ఆల్మట్టి డ్యాం ఎత్తు 519 మీటర్ల నుంచి మరో 5 మీటర్లు పెంచుతామని చెబుతున్నా తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లడటం లేదు. నల్లమల్ల పులి గర్జించాలా లేకుంటే పిల్లిలా ఇంట్లో కూర్చోవాలనా అని ఎద్దేవా చేశారు. ఆయనకు మాట్లాడే దమ్ములేదు.ఈయన నల్లమల్ల పులి కాదని గుంటనక్క అని విమర్శించారు. రూ.70,000 కోట్లు పెట్టి ఎత్తు పెంచుతుంటే కూడా ముఖ్యమంత్రి స్పందించడం లేదని గుర్తుచేశారు. ఆదివారం అచ్చంపేటలో బీఆర్​ఎస్​ ఏర్పాటు చేసిన జనగర్జన సభలో బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతున్నా అడ్డుకునే దమ్ములేదా? అని ప్రశ్నించారు. లేకుంటే గులాబీ దండు వెళ్లి అడ్డుకోవాలా అని అడిగారు. ఇటీవల కాంగ్రెస్​ నుంచి బీఆర్​ఎస్ లో చేరిన కొడంగల్​ ప్రజలే చెబుతున్నారు ఈయన పులి కాదు గుంటనక్క అని అచ్చంపేట నుంచి తరిమికొడితే కొడంగల్​ పోయిండు. ఇప్పుడు కల్వకుర్తి కి అటునుంచి ఆ నక్క ఎటు పోతుందో అని కేటీఆర్​ తెలిపారు. కృష్ణా నది మీద ఆల్మటి పెంచుతుంటే రాహుల్​ గాంధీ కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లడటం లేదన్నారు. మీరు అడ్డుకోకుంటే తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే మా నాయకుడు కేసీఆర్​ ఆధ్వర్యంలో ఆల్మట్టి ఎత్తును అడ్డుకుంటామన్నారు.

రుణమాఫీ ఏమైంది

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కానీ అయ్యిందా అని సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు. ఎంతమందికి రుణమాఫీ అయ్యింది. చారానా చేసిండ్రు, బారానా బాకీ పెట్టిండ్రు అని వివరించారు. డిసెంబర్​ 9 తేదీన సీఎంగా సంతకం చేసిన వెంటనే రుణమాఫీ అన్నడు కానీ హామీని నెరవేర్చలేదన్నారు. బీఆర్​ఎస్​ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు చివరికి పాతరేశారని విమర్శించారు.

తెలంగాణ పరువు తీస్తున్నారు

రేవంత్ రెడ్డి తన పిచ్చి చేష్టలతో, దిగజారిన భాషతో తెలంగాణ పరువు తీస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఒకరోజు పేద రైతుబిడ్డ అని, మరోరోజు పోలీస్ పటేల్ మనవడినని చెప్పే రేవంత్ రెడ్డిలో ఒక అపరిచితుడు ఉన్నాడని ఎద్దేవా చేశారు. ‘గుడ్లు పీకి గోటీలాడుతా’, ‘పేగులు తీసి మెడలో వేసుకుంటా’ అంటూ ఆయన మాట్లాడుతున్న భాష చూస్తే అసహ్యం వేస్తుందన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూ తెలంగాణ పరువును బజారుకీడుస్తున్నారని, హామీలపై నిలదీస్తే ‘నన్ను కోసుకు తింటారా?’ అని మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు.

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్​కు గుణపాఠం చెప్పాలి

మాట తప్పిన రేవంత్ రెడ్డిని ఎన్నికల్లో రాజకీయంగా బొంద పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, అడ్డగోలు మాటలతో తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ సర్కార్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

అచ్చంపేటలో ఎవరో పార్టీ వీడారని బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజల అభిమానం ఉన్న నాయకుడిని కేసీఆర్ త్వరలోనే పంపిస్తారని భరోసా ఇచ్చారు. తిరిగి కేసీఆర్ సీఎం కావాలంటే అచ్చంపేటలో గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి అచ్చంపేటకు బయలుదేరిన కేటీఆర్‌కు దారి పొడవునా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

రేవంత్ నల్లమల్ల గుంటనక్క - Tholi Paluku