
రేవంత్ డ్రీమ్ వర్సెస్ కేటీఆర్ సెటైర్
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన ప్రతిష్టాత్మక 'భారత్ ఫ్యూచర్ సిటీ' ప్రాజెక్ట్‌కు ఆదివారం శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్‌పేట్‌లో 30 వేల ఎకరాల్లో విస్తరించిన ఈ నెట్-జీరో స్మార్ట్ సిటీ, హైదరాబాద్‌పై జనాభా ఒత్తిడి తగ్గించి ప్రపంచ స్థాయి ఆర్థిక, నివాస కేంద్రంగా మారనుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సిడిఎ) భవనానికి పునాది రాయి వేసిన రేవంత్, రావిర్యాలలోని టాటా ఇంటర్‌చేంజ్ నుంచి ఆమంగల్ వరకు 41 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ (ఫేజ్-1)కి కూడా శంకుస్థాపన చేశారు. ఈ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్)ని రీజియనల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్)తో అనుసంధానం చేస్తూ, మచిలీపట్నం పోర్టుకు 12 లేన్ల రహదారి భాగంగా పనిచేస్తుంది. అయితే ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె. తారక రామారావు విమర్శలు సంధించారు. మెట్రోను ముంచేసి ఫ్యూచర్ సిటీ కడతారా అంటూ మాటల తూటాలు పేల్చారు. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.
పదేళ్లు ఇవ్వండి.. ఫ్యూచర్ సిటీ నిర్మించి చూపిస్తాం
ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి, "పదేళ్ల సమయం ఇవ్వండి, ఫ్యూచర్ సిటీని నిర్మించి చూపిస్తాం!" అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. ప్రాజెక్ట్‌పై అనవసర విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. "నాడు వైఎస్ఆర్, చంద్రబాబు కూడా తమపై వచ్చిన విమర్శలు పట్టించుకుని ఉంటే హైటెక్ సిటీ, సైబరాబాద్ ఏర్పడేవా? వారు ఆలోచించారు కాబట్టే ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడుతున్నాం. ఇంకెన్నాళ్లు విదేశాల గురించి మాట్లాడతాం? భవిష్యత్ తరాల కోసం ఇది!" అని ప్రశ్నించారు. దక్షిణాదిలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణకు ఈ సిటీ ఆర్థిక బలం ఇస్తుందని, అమరావతితో అనుసంధానం చేస్తూ జాతీయ అభివృద్ధికి దోహదపడుతుందని స్పష్టం చేశారు. డిసెంబర్‌కు అధారిటీ భవనం పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తామని, సింగరేణికి 10 ఎకరాల భూమి కేటాయించి ఏడాదిలో కార్యాలయం నిర్మించమని ప్రకటించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ కూడా డిసెంబర్‌కల్లా సిద్ధమవుతుందని తెలిపారు. వరల్డ్ బ్యాంక్, జైకా వంటి అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఈ ప్రాజెక్ట్, ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆకర్షిస్తూ లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మెట్రోను ముంచి డ్రీమ్ ప్రాజెక్టా?
మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) ఈ 'డ్రీమ్ ప్రాజెక్ట్'పై గట్టి విమర్శలు గుప్పించారు. 'ఫ్యూచర్ సిటీకి మెట్రోను ముంచేసి కడతాడట!' అంటూ రేవంత్‌పై సెటైర్లతో విరుచుకుపడ్డారు. "ఇప్పుడున్న సిటీకి మెట్రో రద్దు చేసి, ఫ్యూచర్ సిటీకి మెట్రో ప్రణాళిక వేయడంలో రేవంత్ తెలివితేటలు బయటపడ్డాయి!" అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని, రేవంత్ సొంత పార్టీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వ్యాసాలు రాస్తున్నారని గుర్తుచేశారు. "మా ముఖ్యమంత్రి నిధులు ఇవ్వడం లేదని వరల్డ్ బ్యాంకుకు లేఖలు రాస్తున్నాడు! కాంగ్రెస్ పాలన అంత అధ్వాన్నంగా ఉంది" అంటూ విమర్శించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తూ, ఫార్మా సిటీ భూములను తన కుటుంబం, స్నేహితుల కోసం మళ్లించేస్తున్నారని ఆరోపించారు. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్‌ను ఉల్లంఘిస్తున్నారని, రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉపేన్నికల్లో కాంగ్రెస్ హామీలను గుర్తుచేసేందుకు 'బాకీ కార్డులు' పంచుతున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వాడిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన సందర్భంగా రేవంత్, కేటీఆర్ మధ్య ఈ 'మెట్రో vs మెగా సిటీ' డ్రామా, తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌గా మారింది.
