Let's talk: editor@tmv.in
రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి: హరీష్ రావు

రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి: హరీష్ రావు

Gaddamidi Naveen
5 ఏప్రిల్, 2026

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని మాజీమంత్రి హరీష్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. ఆఫీసులో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టి, కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు. హరీష్ రావు శనివారం ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, ఇది ముమ్మాటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అని, ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి అని మండిపడ్డారు.

ప్రజా ప్రతినిధుల కార్యాలయాలపై బహిరంగంగా దాడులు జరుగుతున్నప్పటికీ, రాష్ట్రంలో శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నాయా అనే సందేహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, మీడియాపై దాడులు పెరుగుతున్నాయని ఆయ‌న‌ ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తోందా? అని ప్రశ్నించారు.

ఒకవైపు హేట్ స్పీచ్ బిల్ పేరుతో ప్రతిపక్షాల స్వరాన్ని అణచివేస్తూ, మరోవైపు ఇటువంటి దాడులు జరగడం ద్వంద్వ వైఖరిని చూపుతోందని విమర్శించారు. సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో మునిగిపోయి, ఇక్కడ పాలనను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. ఇందిరమ్మ రాజ్యం అని చెబుతూ 'గూండా రాజ్యం' అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధాలకు, అణచివేతలకు బీఆర్‌ఎస్ అదరదు, బెదరదు అని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు. ఇటువంటి దాడులను ఆపకపోతే ప్రజలే వీధుల్లోకి వచ్చి బుద్ధి చెబుతారని ఆయన ఆయ‌న హెచ్చరించారు.అలాగే ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు తీవ్రంగా ఖండించారు.

రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి: హరీష్ రావు - Tholi Paluku