
రేబిస్‌తో 10 ఏళ్ల బాలిక మృతి
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. వీధి కుక్క కాటుకు గురై సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో రేబిస్ వ్యాధి సోకిన 10 ఏళ్ల లక్షణ అనే బాలిక మృతి చెందింది.బాల్కొండకు చెందిన లక్షణను నెల రోజుల క్రితం ఇంటి పక్కన ఆడుకుంటుండగా ఒక వీధి కుక్క కరిచింది. కాగా చిన్నారి భయంతో ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పలేదు. ఈ నిర్లక్ష్యం కారణంగా, రేబిస్‌ను నివారించడానికి తప్పనిసరి అయిన వ్యాక్సిన్‌ను బాలికకు సకాలంలో ఇవ్వలేకపోయారు.నెల రోజుల తర్వాత లక్షణలో అసహజ ప్రవర్తన కనిపించడం మొదలైంది. నీళ్లు తాగడానికి భయపడటం, గాలిని చూసి భయపడటం వంటి లక్షణాలు గమనించిన తల్లిదండ్రులు ఆందోళనకు గురై వెంటనే బాలికను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించగా అక్కడ వైద్య పరీక్షల అనంతరం లక్షణకు రేబిస్ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు.ఇక పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం లక్షణను వెంటనే హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామని వైద్యులు సూచించడంతో హైదరాబాద్ కి తరలించి చికిత్స అందించినప్పటికీ వ్యాధి తీవ్రత పెరగడంతో బాలిక చికిత్స పొందుతూ మరణించింది.
వీధి కుక్క కరవడం వల్ల రేబిస్ వ్యాధి బారినపడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు పునరావృతమవుతున్నాయి. నిజామాబాద్‌లో లక్షణ (10) మృతి చెందిన ఘటనకు అనుగుణంగా, ఇటీవల గుంటూరు జిల్లాలో ఒక బాలిక, కర్ణాటకలో ఒక చిన్నారి కూడా వీధి కుక్క కాటుకు బారినపడి రేబిస్ వ్యాధి కారణంగా మృతి చెందారు. అదేవిదంగా ఉత్తరప్రదేశ్‌లో కుక్క కాటుకి బదులు దాని గోళ్లతో గాయపడి ఒక బాలుడు రేబిస్ వ్యాధితో మృతి చెందాడు.
రేబిస్ వ్యాధి లక్షణాలు:
• నీరు త్రాగడానికి, గాలిని చూడడానికి భయం
• సాధారణంగా చాలా ఆందోళన చెందడం, అసహజ ప్రవర్తన.
• కోపం, ఉత్కంఠ, అవాంఛనీయ రియాక్షన్లు.
• నిద్రలేమి లేదా అలసట, చర్మం, నరాల సమస్యలు, జలుబు, మలబద్ధకం, తలనొప్పి వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తాయి.
