Let's talk: editor@tmv.in
రేపే నేపాల్‌ సార్వత్రిక ఎన్నికలు

రేపే నేపాల్‌ సార్వత్రిక ఎన్నికలు

Shaik Mohammad Shaffee
4 మార్చి, 2026

హిమాలయ పర్వత దేశం నేపాల్ కీలక ఘట్టానికి సిద్ధమైంది. దేశ ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)కు సంబంధించి గురువారం (మార్చి 5) పోలింగ్ జరగనుంది. 2015 రాజ్యాంగం ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 165 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు నేపాల్ ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భౌగోళిక పరిస్థితులు, జనాభా ప్రాతిపదికన ఈ నియోజకవర్గాలను విభజించారు.

భారీగా పెరిగిన పోలింగ్ కేంద్రాలు

ఈ దఫా ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 10,967 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అదనంగా 168 కేంద్రాలను పెంచడం గమనార్హం. గతంలో 10,892 కేంద్రాలు ఉండగా, ఓటర్ల సౌకర్యార్థం ఈ సంఖ్యను పెంచారు. మొత్తం 275 సభ్యులు గల ప్రతినిధుల సభలో.. 165 మంది 'ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్' (నేరుగా ఓట్ల ద్వారా) పద్ధతిలో ఎన్నికవుతారు. మిగిలిన 110 మందిని దామాషా పద్ధతిలో ఎన్నుకుంటారు.

ఓటరు నాడి ఎటు?

రేపు జరగనున్న ఎన్నికల్లో మొత్తం 1,89,03,689 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 96,63,358 మంది పురుషులు, 92,40,131 మంది మహిళలు ఉండగా.. దాదాపు 200 మంది 'ఇతర' విభాగంలో నమోదయ్యారు. ఈ భారీ సంఖ్యలో ఉన్న ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల బరిలో 68 రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 3,484 మంది అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

అమల్లోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి

నేపాల్‌లో మార్చి 5న (గురువారం) ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనలను చాలా కఠినం చేసింది. నిన్న (మార్చి 3) అర్ధరాత్రి నుంచే ప్రచార హోరుకు తెరపడింది. దీంతో నేడు అభ్యర్థులు ఎవరూ రోడ్లపైకి వచ్చి ప్రచారం చేయడానికి గానీ, ర్యాలీలు నిర్వహించడానికి గానీ వీల్లేదు. అంతేకాకుండా, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల్లో కూడా ఎలాంటి ప్రచార పోస్ట్‌లు పెట్టకూడదని కమిషన్ స్పష్టం చేసింది. ఓటర్లు ఎవరి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆలోచించి, సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతోనే ఈ 'సైలెన్స్ పీరియడ్’ అమల్లోకి తెచ్చారు

నిఘా నీడలో ఎన్నికలు

ఎన్నికల నియమాలు (కోడ్) కచ్చితంగా అమలయ్యేలా చూడాలని నిఘా అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటింగ్ జరిగే రోజున ఎలాంటి గొడవలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి అభ్యర్థులను ఎన్నుకునే 'దామాషా పద్ధతి' కోసం 63 పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ఇప్పటికే అందజేశాయి. నేపాల్ భవితవ్యాన్ని తేల్చే ఈ పోలింగ్‌కు అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యారు.