
రేపు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30న (గురువారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. అక్రమ కేసుల ఆరోపణలతో అరెస్టై, శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజును ఆయన జైలు ములాఖత్ ద్వారా కలవనున్నారు.
రాష్ట్రంలో అక్రమ కేసులు, రాజకీయ వేధింపులకు గురవుతున్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందనే సందేశాన్ని ఇచ్చేందుకు ఈ పర్యటన ఖరారైంది. అంపోలు జిల్లా జైలులో సీదిరి అప్పలరాజును పరామర్శించిన అనంతరం, ఆయన కుటుంబ సభ్యులను కలిసి పార్టీ తరఫున పూర్తి స్థాయి భరోసా, ధైర్యాన్ని వైఎస్ జగన్ కల్పించనున్నారు.
కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తోందని, ఇటువంటి వేధింపులకు భయపడేది లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
