
రేపు వారణాసిలో నాలుగు వందే భారత్ రైళ్లు ప్రారంభం
దేశంలో ఆధునిక రైలు సేవలను విస్తరించేందుకు మరో కీలక అడుగు పడనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8న ఉదయం 8.15 గంటలకు వారణాసి పర్యటనలో భాగంగా నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఇవి బనారస్–ఖజురహో, లక్నో–సహరన్‌పూర్, ఫిరోజ్‌పూర్–ఢిల్లీ, ఎర్నాకుళం–బెంగళూరు మార్గాల్లో నడుస్తాయి. ఈ రైళ్లు రానుండడంతో ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. అలాగే ప్రాంతీయ రవాణా సౌకర్యాలు, పర్యాటక రంగం, వాణిజ్య కార్యకలాపాలు మరింతగా ఊపందుకోనున్నాయి.
బనారస్–ఖజురహో వందే భారత్
ఈ రైలు సుమారు 2 గంటల 40 నిమిషాల ప్రయాణ సమయం ఆదా చేయనుంది. వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, ఖజురహో వంటి పవిత్ర–సాంస్కృతిక కేంద్రాలను కలుపుతూ నడవనుంది. ఈ మార్గం ద్వారా ఖజురహో యునెస్కో వారసత్వ స్థలం చేరుకోవడం మరింత సులభమవుతుంది. భక్తులకు, పర్యాటకులకు వేగవంతమైన, ఆధునిక ప్రయాణ సదుపాయం లభించనుంది.
లక్నో–సహరన్‌పూర్ వందే భారత్
ఈ రైలు రానుండడం వల్ల ప్రయాణ సమయాన్ని దాదాపు ఒక గంట తగ్గించి, 7 గంటల 45 నిమిషాల్లో గమ్యానికి చేర్చనుంది. లక్నో, సితాపూర్, బరేలీ, మొరాదాబాద్, బిజ్నోర్, సహరన్‌పూర్ ప్రాంతాల ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయుక్తం కానుంది. ఈ మార్గం ద్వారా హరిద్వార్‌కు చేరుకోవడమూ మరింత సులభం అవుతుంది.
ఫిరోజ్‌పూర్–ఢిల్లీ వందే భారత్
ఈ రైలు ఆ మార్గంలో అత్యంత వేగవంతమైన సేవగా నిలవనుంది. కేవలం 6 గంటల 40 నిమిషాల్లో ప్రయాణం పూర్తి చేయనుంది. ఫిరోజ్‌పూర్, బఠిండా, పటియాలా వంటి పంజాబ్ నగరాలను ఢిల్లీతో బలంగా కలిపే ఈ సర్వీస్, సరిహద్దు ప్రాంతాల వాణిజ్యం, ఉపాధి అవకాశాల పెరుగుదలకు దోహదం చేస్తుందని అంచనా.
ఎర్నాకుళం–బెంగళూరు వందే భారత్
దక్షిణ భారతదేశంలో ఈ రైలు మరో ప్రగతిశీల అడుగుగా నిలవనుంది. ఈ సర్వీస్‌తో ప్రయాణ సమయం రెండు గంటలకుపైగా తగ్గి, కేవలం 8 గంటల 40 నిమిషాల్లో ప్రయాణం పూర్తవుతుంది. ఇది కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆర్థిక, విద్య, ఐటీ రంగాల పరస్పర సహకారానికి ఊతమివ్వనుంది. ప్రధాని మోడీ ప్రారంభించనున్న ఈ నాలుగు వందే భారత్ రైళ్లు దేశ రైల్వే వ్యవస్థలో కొత్త దశకు శ్రీకారం చుట్టబోతున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
