Let's talk: editor@tmv.in
రేపు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లతో ఈసీఐ సమావేశం

రేపు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లతో ఈసీఐ సమావేశం

Pinjari Chand
23 ఫిబ్రవరి, 2026

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ), రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు (ఎస్ఈసీస్) పాల్గొనే జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం ఫిబ్రవరి 24న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్నారు. ఈసీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 27 ఏళ్ల విరామం తర్వాత ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. చివరిసారిగా ఇటువంటి సమావేశం 1999లో జరిగింది. ఈ సమావేశానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అధ్యక్షత వహించనున్నారు. ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి కూడా హాజరవుతారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు తమ న్యాయ, సాంకేతిక నిపుణులతో కలిసి పాల్గొననున్నారు. అదేవిధంగా 36 రాష్ట్రాలు, యూటీల ప్రధాన ఎన్నికల అధికారులూ (సీఈవోస్) సమావేశంలో పాల్గొంటారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం ఈసీఐ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల మధ్య ఎన్నికల ప్రక్రియలు, లాజిస్టిక్స్ విషయంలో పరస్పర సమన్వయాన్ని బలోపేతం చేయడం. చట్టబద్ధ పరిమితుల పరిధిలో సమగ్ర చర్చలు జరిపి, ఎన్నికల నిర్వహణలో సహకార సమాఖ్య భావనను బలపరచడమే లక్ష్యమని ఈసీఐ పేర్కొంది. రోజంతా జరిగే ఈ సమావేశంలో సాంకేతికత వినియోగం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంస్), ఓటరు జాబితాలు పంచుకోవడాల వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. ఇటీవల ప్రారంభించిన ECINET డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సీనియర్ అధికారులు ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. ఎన్నికల విధులను సులభతరం చేయడంలో దాని పాత్రపై వివరాలు తెలియజేయనున్నారు.

అదేవిధంగా, ఈవీఎంల బలమైన భద్రతా వ్యవస్థలు, పారదర్శకత, రక్షణ చర్యలపై కూడా ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయి. రాష్ట్రాలు/యూటీల వారీగా ఓటర్ల అర్హతపై, ముఖ్యంగా ప్రజాప్రతినిధుల చట్టం–1950 ప్రకారం ఉన్న నిబంధనలపై తులనాత్మక విశ్లేషణ కూడా జరగనుంది.

73వ, 74వ రాజ్యాంగ సవరణల ఆధారంగా రాష్ట్ర చట్టాల ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఏర్పాటయ్యాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే, 243జడ్ ఏ ప్రకారం పంచాయతీలు, మున్సిపల్ సంస్థల ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితాల సిద్ధీకరణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు పర్యవేక్షణ, దిశానిర్దేశం, నియంత్రణ అధికారాలు కల్పించాయి.