Let's talk: editor@tmv.in
రేపు బీహార్ కు రాహుల్ గాంధీ

రేపు బీహార్ కు రాహుల్ గాంధీ

Pinjari Chand
28 అక్టోబర్, 2025

బీహార్ లో ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మహాఘట్భంధన్ నుంచి ఎన్నికల ప్రచార బరిలోకి దిగేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు సంయుక్తంగా సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీహార్‌లో తన తొలి ఎన్నికల సభను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో కలిసి నిర్వహించనున్నారు. ఈ ఇద్దరు నేతలు అక్టోబర్ 29న ముజఫర్‌పూర్, దర్భంగా ప్రాంతాల్లో సంయుక్త సభలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారంలో ఇప్పటి వరకు పాల్గొనకపోవడంతో, ఈ సభలు మహాఘట్భంధన్ కు సరికొత్త ఉత్సాహన్ని ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎన్డీయే నుంచి వరుసగా ప్రధాని నుంచి కేంద్ర మంత్రుల వరకు ఇప్పటికే బీహార్ లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. జేడీయూ, ఇతర పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నప్పటికీ ప్రధానంగా బీజేపీ, ఆర్జేడీ మధ్యే ఎన్నికలన్నట్లు నాయకుల రాజకీయ మాటల వాగ్భాణాలున్నాయి. మహాఘట్భంధన్ నుంచి తేజస్వీ, ముఖేష్ సహని మాత్రమే ప్రచార బరిలో తీవ్రంగా ఎన్డీయేను ఢీకొంటున్నారు.

రైళ్లలో పండుగల రద్దీపై రాహుల్ విమర్శలు

రాహుల్ గాంధీ తాజాగా పండుగల సమయంలో వలస కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించారు. ఛట్ పండుగ సందర్భంగా బీహార్ వైపు వెళ్లే రైళ్లు 200 శాతం సామర్థ్యంతో నిండిపోయాయి అని విమర్శించారు. ప్రజలు తలుపులపై వేలాడుతూ, రూఫ్‌లపై కూర్చునే స్థితి వచ్చింది. ఇవి ఎన్డీయే పాలనలో ఇచ్చిన, చేస్తున్న మోసపూరిత వాగ్దానాల ఫలితాలు అని రాహుల్ ఆరోపించారు. రైల్వే శాఖ 12,000 ప్రత్యేక రైళ్లు నడుపుతామని హామీ ఇచ్చినా, అమలులో మాత్రం విఫలమైందని ఆయన గుర్తు చేశారు. ‘ఇది ప్రజలు పడుతున్న కష్టం కాదు, ప్రభుత్వం విఫలమైందని చెప్పే సజీవ సాక్ష్యం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

గుజరాత్ కు ఎన్ని నిధులు ఇచ్చారు... బీహార్ కు ఎన్ని ఇచ్చారు; తేజస్వి యాదవ్

గుజరాత్‌కి 11 ఏళ్లలో ఎన్ని నిధులు ఇచ్చారు. బీహార్‌కి ఎంత ఇచ్చారు. లెక్కలు చూపించండి అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్. నిధుల కేటాయింపులలో పారదర్శకత పాటించాలన్నారు. రాహుల్ సభలకు ముందు రోజు తేజస్వి ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ బీహార్‌కి వస్తున్నారు. కానీ ఆయన రావడం అంటే బీహార్ ప్రజలను మళ్లీ మోసం చేయడమే అని ఎద్దేవా చేశారు.ఆయన బీహార్ ఎన్నికల ర్యాలీలు, సభలు మాత్రమే నిర్వహిస్తారు. కానీ ఇక్కడ అభివృద్ధి చేయరు.పర్యటనల వల్ల క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ మాత్రం మారవని దుయ్యబట్టారు.

అక్టోబర్ 30న మోదీ పర్యటన

బీహార్‌లో ఎన్డీయే తరపున ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే సమస్తీపూర్ సభ నిర్వహించారు. ఆ సభలో ఆర్జేడీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని, పార్టీని,గతంలో ఆర్జేడీ ప్రభుత్వాన్నిజంగిల్ రాజ్ గా అభివర్​ణించి, ఎన్నికల వాతావరణంలో ప్రకంపనలు సృష్టించారు.తిరిగి ఆయన అక్టోబర్ 30న ముజఫర్‌పూర్, చాప్రా ప్రాంతాల్లో రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర పథకాల గురించి వివరించనున్నారు.

ఇరువురి నేతల సభలు వెంటవెంటనే ఉండడంతో ఎన్డీయే – మహాఘట్భంధన్ మధ్య పోటీ ఉత్కంఠభరితంగా మారింది. రాహుల్–తేజస్వి జంటగా ప్రచార రంగంలోకి దిగడంతో ప్రతిపక్ష శిబిరం ఉత్సాహంగా ఉంది. ఇక ప్రధాని మోదీ సభలతో ఎన్డీయే బలప్రదర్శనకు సిద్ధమవుతోంది. రెండు పక్షాల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కనుంది.