Let's talk: editor@tmv.in
రేపు బాసరలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
రేపు బాసరలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

రేపు బాసరలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Gaddamidi Naveen
5 ఏప్రిల్, 2026

రాష్ట్రంలోని ఆలయ ప్రాంగణాల్లో ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు సాగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉన్నతాధికారులతో కలిసి నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ మాస్టర్ ప్లాన్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.

తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవాలయం తరహాలోనే, రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాల ప్రాంగణాల్లో రాజకీయ ప్రసంగాలు, ర్యాలీలు లేదా ఇతర రాజకీయ కార్యకలాపాలను నిరోధించేలా నిబంధనలు రూపొందించాలని సీఎం సూచించారు. భవిష్యత్తులో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లో విశాలమైన రహదారులు నిర్మించాలని, ఆలయ ప్రాంగణంలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. ఆలయాల ఆధ్యాత్మికతకు విఘాతం కలగకుండా, వాటి పవిత్రతను కాపాడటం కోసం నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఏప్రిల్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటనకు రానున్న నేపథ్యంలో, మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకటస్వామి కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

రాజన్న గెస్ట్ హౌస్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ, 'ప్రజా పాలన - ప్రగతి' కార్యక్రమంలో భాగంగా సుమారు రూ. 300 కోట్ల వ్యయంతో బాసర ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం అత్యాధునిక వసతులు కల్పిస్తామన్నారు. ముఖ్యంగా, రాబోయే గోదావరి పుష్కరాలను ఉత్తర భారతంలోని కుంభమేళా తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని వెల్లడించారు.

ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు

ఏప్రిల్ 6న ముఖ్యమంత్రి బాసరలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిలతో కలిసి సీఎం పర్యటించే మార్గాలను, శంకుస్థాపన చేసే ప్రదేశాలను తనిఖీ చేశారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు మంత్రులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు.

ఆలయ అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్ మంత్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ముధోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు పవార్ రామారావు పటేల్, వేద్మా బొజ్జు పటేల్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసర ప్రకాశించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.