Let's talk: editor@tmv.in
రేపు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ–సి62: తిరుమలలో ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు

రేపు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ–సి62: తిరుమలలో ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు

Panthagani Anusha
11 జనవరి, 2026

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. సోమవారం ఉదయం నింగిలోకి పంపనున్న పీఎస్‌ఎల్‌వీ–సి62 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ తన బృందంతో కలిసి శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాకెట్ నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మిషన్ ద్వారా భూమిని పరిశీలించే ఈఓఎస్ -ఎన్1 పాటు మరో 14 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

కాగా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి జనవరి 12 (సోమవారం) ఉదయం 10:17 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు సంబంధించిన 25 గంటల కౌంట్‌డౌన్ ఆదివారం ఉదయమే ప్రారంభమవుతుంది. ఇది పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 64వ ప్రయోగం కావడం విశేషం. గతంలో ఇదే పీఎస్‌ఎల్‌వీ ద్వారా చంద్రయాన్-1, మంగళయాన్, ఆదిత్య-ఎల్1 వంటి కీలకమైన మిషన్లను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. తాజా ప్రయోగంలో థాయ్‌లాండ్, బ్రిటన్ దేశాలకు చెందిన ముఖ్యమైన ఉపగ్రహాలు కూడా ఉన్నాయి.

రాకెట్ నింగిలోకి ఎగిరిన కేవలం 17 నిమిషాల వ్యవధిలోనే అన్ని ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగం ఇదే కావడం గమనార్హం. ఈ మిషన్ విజయవంతమైతే భారతదేశం నుంచి ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 442కు చేరుకుంటుంది. ఇస్రో అధికారులతో పాటు ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అదే సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈఓఎస్-ఎన్1(భూ పరిశీలన ఉపగ్రహం) ప్రాథమికంగా అంతరిక్షం నుండి భూమిని నిశితంగా గమనించే ఒక శక్తివంతమైన డిజిటల్ కన్ను లా పనిచేస్తుంది. దీని ద్వారా లభించే హై-రిజల్యూషన్ చిత్రాలు వ్యవసాయ రంగంలో పంటల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, అడవుల విస్తీర్ణం నీటి వనరుల నిల్వలను అంచనా వేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాకుండా, తుఫానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్ట తీవ్రతను త్వరగా గుర్తించి, సహాయక చర్యలను వేగవంతం చేయడానికి పట్టణ ప్రణాళికలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన కీలకమైన మ్యాపింగ్ సమాచారాన్ని అందించడంలో ఈ ఉపగ్రహం ప్రధాన పాత్ర పోషిస్తుంది.