
రేపు ఎయిర్ పోర్స్ అకాడమీకి సీడీఎస్ అనిల్ చౌహాన్ రాక
భారత రక్షణ దళాల సమన్వయాధికారి (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ డిసెంబర్ 13న డుందిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ లో నిర్వహించనున్న 216వ కోర్సు కంబైన్‌డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ను సమీక్షించనున్నారు. ఈ వేడుకతో భారత వైమానిక దళం వివిధ విభాగాల ఫ్లైట్ కేడెట్ల ప్రీ-కమీషనింగ్ శిక్షణ విజయవంతంగా పూర్తవుతుంది. కార్యక్రమంలో జనరల్ చౌహాన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కేడెట్లకు ‘ప్రెసిడెంట్ కమిషన్’ అందజేస్తారు.
శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన భారత వైమానిక దళం ఫ్లైట్ కేడెట్లు, భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్ అధికారులతో పాటు వియత్నాం నుంచి వచ్చిన శిక్షణార్థులకు ‘వింగ్స్’ ‘బ్రెవెట్స్’ ప్రదానం చేస్తారు. ఫ్లయింగ్ బ్రాంచ్‌లో మెరిట్‌లో మొదటి స్థానంలో నిలిచిన కేడెట్‌కు ‘ప్రెసిడెంట్ ప్లాక్’, ‘నవనగర్ స్వోర్డ్ ఆఫ్ ఆనర్’ అందజేస్తారు. ఇతనే ఈ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు కమాండర్‌గా వ్యవహరిస్తారు. అలాగే నావిగేషన్, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌లలో మొత్తం మెరిట్‌లో మొదటి స్థానం పొందిన కేడెట్లకు కూడా సీడీఎస్ ప్రెసిడెంట్ ప్లాక్ అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో ఆకాశ్ గంగా టీం, ఎయిర్ వారియర్ డ్రిల్ టీం ప్రదర్శనలు, అలాగే పిలాటస్ పీసీ-7, హాక్, కిరణ్, చేతక్ విమానాల ఫ్లైపాస్ట్‌లు ఉంటాయి. అదనంగా సరంగ్ హెలికాప్టర్ డిస్ప్లే టీం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం అద్భుత వైమానిక విన్యాసాలు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి.
