

రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు
ఏప్రిల్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన '99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' అమలు తీరును, పురోగతిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం సమీక్షించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, ఈ భారీ ప్రజా బాంధవ్య కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రేపటి నుంచి ప్రతి గ్రామసభ, మున్సిపాలిటీల్లోనూ రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను అత్యంత పారదర్శకంగా వెల్లడించాలని అధికారులను ఆదేశించారు. జూన్ 2 నుంచి అమలుకానున్న 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకంతో పాటు, విద్యార్థులకు అందిస్తున్న పోషకాహారం, మధ్యాహ్న భోజన పథకాల విశిష్టతను ప్రజలకు సమగ్రంగా వివరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా క్షేత్రస్థాయిలో యంత్రాంగం నిరంతరం శ్రమించాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
కె. రామకృష్ణారావు మాట్లాడుతూ, గ్రామ సభలు, వార్డ్ సభలు తప్పనిసరిగా నిర్వహించాలని, ఇప్పటికే అందించిన ప్రామాణిక విధానాల ప్రకారం క్రమబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిందిగా కలెక్టర్లను సూచించారు. ప్రజాప్రతినిధుల సక్రియ భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం ద్వారా ప్రజల విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ప్రభుత్వ ప్రధాన పథకాలు, కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త పథకాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి పౌరుడికి సమాచారం చేరేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
అదే విధంగా, లబ్ధిదారుల అభిప్రాయాలను వ్యవస్థబద్ధంగా సేకరించాలని, వాటి ఆధారంగా ప్రభుత్వ పథకాల అమలులో లోపాలను గుర్తించి మెరుగులు దిద్దాలని ఆదేశించారు. ఫీల్డ్ స్థాయిలో సమన్వయం, ప్రజల భాగస్వామ్యం, విభాగాల మధ్య సహకారం ఈ కార్యక్రమ విజయానికి కీలకమని ఆయన స్పష్టం చేశారు. ప్లానింగ్ శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ గ్రామ సభల నిర్వహణలో అనుసరించాల్సిన కార్యాచరణ క్రమాన్ని వివరించి, అన్ని జిల్లాల్లో ఒకే విధంగా సమావేశాలు జరిగేలా మార్గదర్శకాలు ఇచ్చారు. మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి టి.కె. శ్రీదేవి, వార్డ్ సభల్లో 100 శాతం పన్ను వసూలు చేసిన సిబ్బందిని సత్కరించాలని సూచించారు.
ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జోంగ్తూ మాట్లాడుతూ, ఏప్రిల్ 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా “హెల్త్ వీక్” నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాలు, అవగాహన శిబిరాలు చేపట్టి ప్రజల ఆరోగ్య స్థితిని మెరుగుపర్చాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
