
రేపటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ‘హెల్త్ వీక్’ ప్రారంభం
ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడం, ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేయడం లక్ష్యంగా వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో మహిళలు, యువత , విద్యార్థులను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
రోజువారీ కార్యక్రమాలు
• ఏప్రిల్ 6 ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే: ఉదయం 6:30 గంటలకు నెక్లెస్ రోడ్ వద్ద 'ఈట్ రైట్ వాక్' ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం నేచురోపతి ఆసుపత్రిలో 40 స్టాళ్లతో 'మిల్లెట్ మేళా' నిర్వహిస్తారు. ఆహార విక్రేతలకు హైజీన్ రేటింగ్ సర్టిఫికేట్లు అందజేస్తారు.
• ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: నిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక ఎల్ఐఎన్ఏసీ యంత్రాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం రవీంద్రభారతిలో 871 మంది కొత్త డాక్టర్లకు నియామక పత్రాలు అందజేస్తారు. ఇదే వేదికపై తెలంగాణ కేన్సర్ రిజిస్ట్రీ, ట్రామా కేర్ పాలసీ వంటి కీలక పోర్టల్స్‌ను ప్రారంభించనున్నారు.
• ఏప్రిల్ 8 సేఫ్ మదర్ డే: గర్భిణీ స్త్రీలకు ఏఎన్సీ పరీక్షలు, హైరిస్క్ కేసుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. బోయిగూడలోని మిడ్‌వైఫరీ శిక్షణ సంస్థలో ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది.
• ఏప్రిల్ 9 ఎయిడ్స్ అవగాహన: హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కోసం హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో రెడ్ రన్ ర్యాలీలు నిర్వహిస్తారు. జైళ్లలో, ట్రాన్స్‌జెండర్ క్లినిక్స్‌లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు.
• ఏప్రిల్ 10 హోమియోపతి & ఆయుష్ డే: ఉదయం యోగా ప్రదర్శనలతో ప్రారంభమై, హోమియోపతి కళాశాలలో రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహిస్తారు. జిల్లాల్లో ఆయుష్ వైద్య శిబిరాలు విస్తృతంగా ఉంటాయి.
• ఏప్రిల్ 11 డ్రగ్స్ కంట్రోల్ స్ట్రెంథెనింగ్ డే: మందుల భద్రత, మాదకద్రవ్యాల అనర్థాలపై అవగాహన కల్పిస్తారు. గాంధీ ఆసుపత్రిలో డీ-అడిక్షన్ ట్రీట్మెంట్ క్యాంపు నిర్వహిస్తారు. విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు.
• రాష్ట్ర ఆరోగ్య రంగ అభివృద్ధికి ఈ హెల్త్ వీక్ ఒక మైలురాయిగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఇతర విభాగాల డైరెక్టర్లు పాల్గొన్నారు.
