
రేపటి నుంచే ‘ఫ్రీస్టైల్ చెస్’ ప్రపంచ సమరం
చదరంగం ప్రపంచంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. సంప్రదాయ చెస్‌కు భిన్నంగా ఉండే 'ఫ్రీస్టైల్ చెస్' (దీనినే చెస్960 లేదా ఫిషర్ రాండమ్ చెస్ అని కూడా పిలుస్తారు) తొలి అధికారిక ప్రపంచ ఛాంపియన్‌షిప్ జర్మనీలోని వైసెన్‌హాస్‌లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 13 నుండి 15 వరకు జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ప్రపంచ అత్యుత్తమ ఎనిమిది మంది క్రీడాకారులు తలపడనున్నారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే), ఫ్రీస్టైల్ చెస్ ఆపరేషన్స్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి.
ఏమిటీ ‘ఫ్రీస్టైల్ చెస్’?
సాధారణ చెస్‌లో పావుల అమరిక ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కానీ ఫ్రీస్టైల్ చెస్‌లో పావులను ఆట ప్రారంభానికి ముందు ర్యాండమ్‌గా అమరుస్తారు. దీనివల్ల ఆటగాళ్లు ముందుగా ఎత్తుగడలను బట్టీ పట్టడానికి వీలుండదు. ఆట ప్రారంభమైన వెంటనే అక్కడికక్కడే వ్యూహాలను రచించాల్సి ఉంటుంది. ఈ విధానం ఆటగాళ్ల అసలైన నైపుణ్యాన్ని, సృజనాత్మకతను పరీక్షిస్తుంది.
బరిలో దిగ్గజాలు.. భారత్ నుంచి అర్జున్
ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది మంది దిగ్గజ క్రీడాకారులు పోటీ పడుతున్నారు. 2025 గ్రాండ్ స్లామ్ టూర్ విజేత మాగ్నస్ కార్ల్‌సన్ ప్రధాన ఆకర్షణగా నిలవగా, భారత స్టార్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరితో పాటు ఫాబియానో కరువానా, లెవాన్ అరోనియన్, విన్సెంట్ కీమర్, జావోఖిర్ సిందరోవ్, హన్స్ నీమాన్, నోడిర్బెక్ అబ్దుసత్తోరోవ్ ఈ టైటిల్ కోసం పోరాడనున్నారు.
భారీ ప్రైజ్ మనీ.. మూడు రోజుల షెడ్యూల్
ఈ ఛాంపియన్‌షిప్ కోసం నిర్వాహకులు 3 లక్షల డాలర్ల (సుమారు రూ.2.7 కోట్లు) భారీ ప్రైజ్ మనీని ప్రకటించారు. ఈ టోర్నీ మూడు రోజుల పాటు వివిధ ఉత్కంఠభరిత ఫార్మాట్లలో సాగనుంది. ఫిబ్రవరి 13న జరిగే రాపిడ్ రౌండ్ రాబిన్ దశలో మొత్తం ఎనిమిది మంది ఆటగాళ్లు ఒకరితో ఒకరు తలపడతారు. ఇందులో ప్రతిభ కనబరిచి మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన వారు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.
అనంతరం ఫిబ్రవరి 14న నాకౌట్ స్టేజ్ ప్రారంభమవుతుంది, ఇందులో సెమీఫైనల్స్‌తో పాటు మిగిలిన స్థానాల కోసం ప్లేస్‌మెంట్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఈ దశలో ఒక్కో మ్యాచ్‌కు 25 నిమిషాల సమయం కేటాయించారు. ఇక ఆఖరి రోజైన ఫిబ్రవరి 15న ఫైనల్ పోరు జరుగుతుంది. మొత్తం నాలుగు గేమ్‌ల పాటు సాగే ఈ తుది పోరులో గెలిచిన వారే ‘ఫ్రీస్టైల్ చెస్’ తొలి ప్రపంచ విజేతగా నిలుస్తారు.
ప్రత్యక్ష ప్రసారం
ఈ చారిత్రాత్మక టోర్నీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెస్ అభిమానులు చెస్ టీవీ, ట్విచ్, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. వినూత్నమైన ఈ ఫార్మాట్ రాబోయే రోజుల్లో చెస్ ఆటకు మరింత క్రేజ్ తీసుకువస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
