Let's talk: editor@tmv.in
రెవెన్యూ వ్యవస్థను భ్రష్టుపట్టించిన రేవంత్ రెడ్డి సర్కార్: హరీష్ రావు తీవ్ర విమర్శలు

రెవెన్యూ వ్యవస్థను భ్రష్టుపట్టించిన రేవంత్ రెడ్డి సర్కార్: హరీష్ రావు తీవ్ర విమర్శలు

Dantu Vijaya Lakshmi Prasanna
27 ఫిబ్రవరి, 2026

సిద్దిపేట అర్బన్ ఎమ్మార్వో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావ్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని, భూభారతి తీసుకొచ్చి రెవెన్యూ వ్యవస్థను ఉద్ధరిస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నా, చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. కార్యాలయం వద్ద తమ పనుల కోసం పడిగాపులు కాస్తున్న ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.

భూభారతి అమలులో భాగంగా ఏప్రిల్ నెలలో గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 8,68,000 దరఖాస్తులు వచ్చాయని హరీష్ రావు గుర్తు చేశారు. అయితే పది నెలలు గడిచినా ఆ దరఖాస్తులు ఏమయ్యాయో, కనీసం ఆన్‌లైన్‌లో నమోదు చేశారా లేదా అన్నది కూడా ప్రభుత్వానికి తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎన్ని దరఖాస్తులు పరిష్కారమయ్యాయన్న అంశంపై ప్రజలకు ఎలాంటి జవాబుదారీతనం లేదని, వాటిని చెత్తబుట్టలో వేశారా లేక పాత కాగితాల కింద అమ్ముకున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మ్యుటేషన్‌తో సహా వారం రోజుల్లోనే పాస్‌బుక్ నేరుగా రైతు ఇంటికే వచ్చేదని తెలిపారు. కానీ ఇప్పుడు భూభారతి పేరుతో రిజిస్ట్రేషన్ సమయంలో పాస్‌బుక్ ఫీజు కింద 300 రూపాయలు వసూలు చేస్తున్నా, ఆరు నెలలు గడిచినా పాస్‌బుక్ ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 6.20 లక్షల మంది రైతులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా సాదా బైనామాలు చేసి పాస్‌బుక్‌లు ఇచ్చామని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఈ ప్రక్రియను అడ్డుకుంటోందని ఆరోపించారు.

సాదా బైనామాకు భూమి అమ్మిన వ్యక్తి అఫిడవిట్ తప్పనిసరి అనే కొత్త నిబంధన తీసుకువచ్చి లక్షల మంది రైతుల నోట్లో మట్టి కొట్టారని హరీష్ రావు విమర్శించారు. భూమి అమ్మిన వారు మళ్లీ ఎందుకు అఫిడవిట్ ఇస్తారని ప్రశ్నించారు. ఈ నిబంధన వల్ల ఒక్కరికి కూడా సాదా బైనామా అమలు కావడం లేదని, సిద్దిపేట రూరల్‌లో 2400, అర్బన్‌లో 1200 దరఖాస్తులు వచ్చినా ఇప్పటివరకు ఒక్క పాస్‌బుక్ కూడా ఇవ్వలేదన్నారు.

అదేవిధంగా గతంలో 10 శాతంగా ఉన్న నిషేధిత భూముల సంఖ్యను కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా కోటి ఎకరాలకు పెంచిందని ఆరోపించారు. హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా నిషేధిత భూముల జాబితాను పబ్లిక్ డొమైన్‌లో పెట్టడం లేదని, ఇది పక్కా రియల్ ఎస్టేట్ దందాకు నిదర్శనమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితం అని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తోందని, చనిపోయిన వీఆర్ఓల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.