Let's talk: editor@tmv.in
‘రెడ్‌ఫోర్ట్‌ పేలుడు’ కుట్రలో మరో ఆత్మాహుతి బాంబర్‌?

‘రెడ్‌ఫోర్ట్‌ పేలుడు’ కుట్రలో మరో ఆత్మాహుతి బాంబర్‌?

Pinjari Chand
19 జనవరి, 2026

గత ఏడాది నవంబర్ లో రెడ్‌ఫోర్ట్‌ సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడుకు సంబంధించి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడికి సూత్రధారి అయిన డాక్టర్‌ ఉమర్‌–ఉన్‌–నబీ మరో ఆత్మాహుతి బాంబర్‌ను నియమించేందుకు చేసిన ప్రయత్నం చివరి నిమిషంలో విఫలమైంది. కుటుంబానికి సహాయం చేయాల్సిన అవసరం, ముఖ్యంగా యాపిల్‌ పంట కోత సమయం కారణంగా అతడు వెనక్కి తగ్గినట్లు అధికారులు తెలిపారు. నవంబర్‌ 10న చారిత్రక రెడ్‌ఫోర్ట్‌ వెలుపల జరిగిన పేలుడులో 12 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని నడిపిన వ్యక్తే డాక్టర్‌ ఉమర్‌–ఉన్‌–నబీ అని దర్యాప్తులో తేలింది. శ్రీనగర్‌ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కలిసి అతడు ఏర్పాటు చేసిన సమాంతర ఉగ్ర మాడ్యూల్‌ను బయటపెట్టాయి. ఈ విచారణలో షోపియన్‌కు చెందిన యాసిర్‌ అహ్మద్‌ దార్‌ అనే యువకుడిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. డాక్టర్‌ నబీ అతడిని ఆత్మాహుతి బాంబర్‌గా తయారు చేయడంలో కొంతవరకు విజయవంతమయ్యాడని, అయితే గత ఏడాది ఆగస్టులో జరిగిన సమావేశంలో దార్‌ చివరి క్షణంలో వెనక్కి తగ్గాడని అధికారులు చెప్పారు. యాపిల్‌ పంట సీజన్‌, ఇంటి మరమ్మతులు ఉండడమే కారణాలుగా అతడు పేర్కొన్నాడు. దార్‌ 2023 నుంచే నబీతో టచ్ లో ఉన్నట్లు విచారణలో తేలింది. వైద్యుడిగా నబీకి ఉన్న సామాజిక స్థానం అతడి తీవ్రవాద ఆలోచనలకు విశ్వసనీయతను పెంచి, యువకులను ప్రభావితం చేయడంలో కీలకంగా మారిందని అధికారులు పేర్కొన్నారు.

మాడ్యుల్ బయటపడినా దాడులకు ప్లాన్

దర్యాప్తు ప్రకారం నబీ కేవలం ఉగ్రవాది మాత్రమే కాకుండా వ్యూహాత్మక నియామకదారుడిగా కూడా పనిచేశాడు. ఒక మాడ్యూల్‌ బయటపడినా కార్యకలాపాలు కొనసాగేందుకు ద్వితీయ, స్వతంత్ర సెల్‌లను నిర్మించేందుకు ప్రయత్నించాడు. విచారణలో నిందితుల ఫోన్‌లలో ఒక వాయిస్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘బైత్‌’ (జిహాద్‌కు విధేయత ప్రమాణం) ఉచ్చరిస్తున్నట్లు ఉంది. పాఠశాల మానేసిన దార్‌ పేరు గతంలోనే దర్యాప్తుల్లో వెలుగులోకి వచ్చింది. అతడి స్నేహితుల్లో ఒకరు ఉగ్రవాద సంస్థలో చేరడంతో అతడిపైనా అనుమానం పెరిగింది. టెలిగ్రామ్‌ ద్వారా నబీతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాడని, శారీరకంగా పూర్తి శిక్షణ పొందాలని అతడిని ప్రోత్సహించారని అధికారులు తెలిపారు. నబీ నియమించేందుకు ప్రయత్నించిన రెండో ఆత్మాహుతి బాంబర్‌ దార్‌నేనని, మానవ బాంబర్‌ లేకుండా తమ దాడులు సాధ్యంకావని నబీ గట్టిగా నమ్మేవాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

ఆత్మహత్య నిషిద్దమన్న కారణంతో వెనక్కి తగ్గిన మరో వ్యక్తి

ఇదే సమయంలో గత ఏడాది శ్రీనగర్‌ పోలీసులు ఈ ‘డాక్టర్‌ మాడ్యూల్‌’ను ఛేదించే క్రమంలో ఖాజిగుండ్‌కు చెందిన జాసిర్‌ అలియాస్‌ దానిష్‌ను అరెస్టు చేశారు. రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పొందిన జాసిర్‌, 2024 అక్టోబర్‌లో కుల్గామ్‌లోని ఓ మసీదులో ఈ మాడ్యూల్‌ సభ్యులను కలిశానని విచారణలో చెప్పాడు. అక్కడి నుంచి ఫరీదాబాద్‌లోని అల్‌–ఫలాహ్‌ యూనివర్సిటీ సమీపంలోని వారు ఉంటున్న అద్దె గదికి తీసుకెళ్లారని తెలిపాడు. ఇతర సభ్యులు తనను ఓవర్‌గ్రౌండ్‌ వర్కర్‌గా (ఓజీడబ్ల్యూ) పనిచేయమన్నప్పటికీ, నబీ నెలల తరబడి తీవ్రంగా మైండ్‌వాష్‌ చేసి ఆత్మాహుతి బాంబర్‌గా మారమని ఒత్తిడి తెచ్చాడని జాసిర్‌ వెల్లడించాడు. అయితే తన దారుణ ఆర్థిక పరిస్థితి, ఇస్లాంలో ఆత్మహత్య నిషిద్ధమన్న నమ్మకం కారణంగా అతడు కూడా వెనక్కి తగ్గాడు.

భారీ పేలుళ్లకు ప్లాన్

శ్రీనగర్‌ సీనియర్‌ ఎస్పీ డా. జి.వి. సుందీప్‌ చక్రవర్తి నేతృత్వంలో సాగిన దర్యాప్తుతో ఈ ఆత్మాహుతి బాంబర్‌ నియామక యత్నం బయటపడింది. ఇది జైష్‌–ఎ–మొహమ్మద్‌కు అనుబంధంగా ఉన్న అంతర్రాష్ట్ర ఉగ్ర నెట్‌వర్క్‌ దర్యాప్తుకు కొత్త కోణాన్ని జోడించిందని అధికారులు తెలిపారు. పీటీఐ గతంలో వెల్లడించినట్టు, పుల్వామాకు చెందిన 28 ఏళ్ల డాక్టర్‌ నబీ ఈ నెట్‌వర్క్‌లో అత్యంత తీవ్రవాద భావజాలం కలిగిన కీలక పాత్రధారి. కాశ్మీర్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో విస్తరించిన ఈ నెట్‌వర్క్‌ డిసెంబర్‌ 6 (బాబ్రీ మసీదు కూల్చివేసిన దినం) సమయంలో భారీ వాహన బాంబు పేలుళ్లకు ప్లాన్‌ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. రాజధానిలోని జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతం లేదా మతపరంగా ప్రాధాన్యం ఉన్న ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకుని పేలుడు జరిపి అనంతరం పరారయ్యే యోచన నబీది అని విచారణలో తేలింది. సహనిందితుడు డా. ముజమ్మిల్‌ అహ్మద్‌ గనాయితో కలిసి 2021లో టర్కీ వెళ్లిన తర్వాతే నబీ తీవ్రవాద మార్గంలోకి వెళ్లినట్లు అధికారులు చెప్పారు. ఆ ప్రయాణంలో జైష్‌–ఎ–మొహమ్మద్‌ ఓవర్‌గ్రౌండ్‌ వర్కర్లను కలిసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తిరిగి వచ్చిన తర్వాత ఫరీదాబాద్‌లోని అల్‌–ఫలాహ్‌ యూనివర్సిటీలో బోధిస్తూనే, నబీ–గనాయిలు బహిరంగ మార్కెట్‌ నుంచి భారీగా రసాయనాలు కొనుగోలు చేశారు. అమోనియం నైట్రేట్‌, పొటాషియం నైట్రేట్‌, సల్ఫర్‌ వంటి పదార్థాలు సుమారు 360 కిలోల వరకు సేకరించి, యూనివర్సిటీ సమీపంలో నిల్వ చేశారు. శ్రీనగర్‌ పోలీసులు గనాయిని అరెస్టు చేసి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో ఈ డిసెంబర్‌ ప్లాన్‌ కూలిపోయింది. దీంతో భయపడిన నబీ, చివరకు రెడ్‌ఫోర్ట్‌ వెలుపల ముందస్తు పేలుడుకు కారణమయ్యాడని అధికారులు తెలిపారు.

అక్టోబర్‌ 19, 2025న శ్రీనగర్‌ అవుట్‌స్కర్ట్స్‌లోని బున్‌పోరా, నౌగామ్‌ ప్రాంతాల్లో జైష్‌–ఎ–మొహమ్మద్‌ పోస్టర్లు కనిపించడంతో ఈ మొత్తం ఉగ్ర నెట్‌వర్క్‌ బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించిన పోలీసులు స్థానికులైన ముగ్గురిని అరిఫ్‌ నిసార్‌ దార్‌ అలియాస్‌ సహిల్‌, యాసిర్‌–ఉల్‌–అష్రఫ్‌, మక్సూద్‌ అహ్మద్‌ దార్‌ అలియాస్‌ షాహిద్‌ను అరెస్టు చేశారు. వీరిపై గతంలో రాళ్లదాడి కేసులు ఉన్నాయి. వారి విచారణతో షోపియన్‌కు చెందిన మాజీ పారా మెడిక్‌, ప్రస్తుతం ఇమామ్‌గా ఉన్న మౌల్వీ ఇర్ఫాన్‌ అహ్మద్‌ అరెస్టయ్యాడు. పోస్టర్లు సరఫరా చేయడమే కాకుండా, డాక్టర్లను తీవ్రవాద భావజాలంతో ప్రభావితం చేయడంలో అతడి పాత్ర ఉందని అధికారులు తెలిపారు.